నత్త నడకన భూ పంపిణీ !
* ఇప్పటికి 28 శాతమే లక్ష్య సాధన
* లక్ష్యం 8,634 ఎకరాలు.. పంపిణీ చేసింది 2,449 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు భూపంపిణీ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది (2015-16) లక్ష్య సాధన మరీ తీసికట్టుగా మారింది. నిర్దేశించుకున్న లక్ష్యాలకు కేవలం 28 శాతం మేరకేసాధించడంతో.. రాబోయే రోజుల్లో ఇది ఏవిధంగా వేగం పుంజుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ భూమి తగినంత లేకపోవడంతో ఎకరాకు రూ. 2-7 లక్షల మధ్య వెచ్చించి ప్రైవేట్‌భూమి కొనుగోలు చేసి వ్యవసాయాధార ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ కేటాయించింది.
అయితే భూమి కొనుగోలుకు సంబంధించి వివిధ ప్రక్రియలను పూర్తిచేయడం అటు జాయింట్ కలెక్టర్ మొదలుకుని కిందిస్థాయిలో రెవెన్యూ సిబ్బందికి, ఇటు ఎస్సీకార్పొరేషన్ ఈడీ మొదలుకుని, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇబ్బందిగా పరిణమించింది. మొత్తం 2,878 మంది లబ్ధిదారులకు 8,634 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్.. 9 జిల్లాల (హైదరాబాద్ మినహా) అధికారులను ఆదేశించింది. అయితే ఇప్పటివరకు (ఈనెల 12 నాటికి) కేవలం 903 మందికి 2,449.61 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు.
లక్ష్యసాధనలో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా మాత్రమే 54 శాతం సాధించి మెరుగ్గా ఉండగా, మెదక్ 43, ఆదిలాబాద్ 42, వరంగల్ జిల్లా 29 శాతం లక్ష్యాలను సాధించాయి. మిగిలిన ఇతర జిల్లాలు 20 శాతం లోపున్నాయి. రంగారెడ్డి జిల్లా కేవలం 12 మందికి 35.39 ఎకరాలు పంపిణి చేసి అట్టడుగున నిలిచింది. భూమి కొనుగోలుకు రూ.431.70 కోట్లు అందుబాటులో ఉంచగా, కేవలం రూ.103.82 కోట్లు ఖర్చుచేశారు.
పంపిణీ చేసిన భూమిలో 659 మంది లబ్ధిదారులకు 1,814 ఎకరాలు మాత్రమే భూమి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందజేశారు. ఇంకా మూడోవంతు మందికి భూమిని రిజిష్టర్ చేయాల్సి ఉంది. అదీగాక ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి అభివృద్ధికి తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో లబ్ధిదారులకు ప్రయోజనం కలగడం లేదు.