
మీడియాతో మాట్లాడుతున్న లచ్చిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాల నిర్వహణకు రెవెన్యూ వర్గాలు అంగీకరించా యి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల భర్తీ తదితర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినందునే ఇందుకు అంగీకరిస్తున్నట్టు టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతం కుమార్ తెలిపారు.
ఆదివారం టీజీటీఏ కార్యవర్గ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత వస్తుందని, ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు దగ్గరవుతాయన్నా రు. ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఈ భేటీలో టీజీటీఏ కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు ముంతాజ్, విష్ణుసాగర్ పాల్గొన్నారు.