
మళ్లీ తుపాను ముప్పు
శ్రీకాకుళం పాతబస్టాండ్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతుండటంతో జిల్లాకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఈ తుపాను మరింత బలపడే అవకాశముందన్న సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధికారులను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. అయా మండలాల్లో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, తుపాను వస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నాహాలతోపాటు బియ్యం, కిరోసిన్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువులను తగినంతగా సమకూర్చుకోవాలని గురువారం సాయంత్రమే ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచిస్తూ మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించాలని, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు.