ఈసీ తాజా ఉత్తర్వులతో ఎన్నికల బదిలీలు వారికి లేనట్టే !
40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్‌లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి.
ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికలకు ఆర్‌ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్‌ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఈసీకి సీఎస్ లేఖ
కాగా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం.
లోక్‌సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment