ఇసుకాసురులకు షాక్ | Shock to the sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుకాసురులకు షాక్

Published Sat, Aug 29 2015 3:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

Shock to the sand mafia

ఇసుక మాఫియాకు ‘షాక్’ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా.. ఇసుకాసురుల ఆగడాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ మేరకు అటు మహారాష్ట్ర సర్కారుతోపాటు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అధికారులు ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగారు. రెవెన్యూ, టీఎస్‌ఎండీసీ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ సురేష్‌కాకనీ బిలోలి సైతం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు.

కలెక్టర్ ఆదేశాలతో బిలోలి తహసీల్దార్ సురేఖస్వామి, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి మహారాష్ట్రలోని మచూనూరు ప్రాంతం నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 23 లారీలను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయూనికి తరలించారు. అంతేకాకుండా ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి లారీ యజమానుల వివరాలు...  ఎప్పుటి నుంచి తరలిస్తున్నారు... వంటి వివరాలు సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు శుక్రవారం బిచ్కుంద మండలం పుల్కల్‌లో విచారణ చేపట్టారు.

అనుమతి లేని చోట్ల ఇసుక తవ్వకాలకు సంబంధించి స్థానిక ఆర్‌ఐ అజయ్, వీఆర్వో కిశోర్‌రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బీర్కూర్ గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక క్వారీని టీఎస్‌ఎండీసీ జీఎం రాజశేఖర్‌రెడ్డి, మైన్స్ ఆర్‌ఐ హరిప్రసాద్ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. శాండ్ రీచ్ అసిస్టెంట్లు సతీష్, అనిల్ వద్ద పలు అంశాలపై ఆరా తీశారు. 39,900 ఘనపు మీటర్ల ఇసుక తరలించడానికి అనుమతి ఉండగా... ఇప్పటి వరకు 18 వేల ఘనపు మీటర్ల ఇసుక తరలించినట్లు వారు అధికారులకు తెలిపారు.

ఆ తర్వాత వారు ఇసుక తవ్వుతున్న స్థలానికి వెళ్లి హద్దులు గమనించారు. ఈ సమయంలో స్థానిక రైతులు అక్కడికి వచ్చి అధికారులతో తమ బాధను వెళ్లదీసుకున్నారు. లోతుగా తవ్వడం వల్ల భూగర్బజలాలు అడుగంటుతున్నాయని... ఇసుకక్వారీని నిలిపివేయాలని కోరారు. పట్టాభూమిలో మట్టివచ్చే వరకు ఇసుక తవ్వకానికి అనుమతి ఉందని టీఎస్‌ఎండీసీ జీఏం వారికి సమాధానమిచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఇసుక తరలిస్తున్నారని.. రాత్రంతా రవాణా సాగుతోందని రైతులు చెప్పగా... అలా చేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా తమకు పట్టివ్వాలని ఆయన సూచించారు. పదుల సంఖ్యలో లారీలు క్వారీలోగాని, రోడ్లపైగాని నిల్చోకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అరుుతే టీఎస్‌ఎండీసీ, మైన్స్ అధికారులు తనిఖీకి వచ్చిన విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

 క్షేత్రస్థాయి నుంచి...
 అక్రమ ఇసుక వ్యాపారానికి సంబంధించి క్షేత్ర స్థాయి నుంచి చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ యోగితా రాణా సిద్ధమయ్యూరు.ఇసుక తవ్వుకోవడానికి ఎంత వరకు అనుమతి ఉంది....  తవ్వకాలు ఎక్కడివరకు జరిగాయని స్వయంగా తనిఖీలు చేయూలని అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ, టీఎస్‌ఎండీసీ అధికారుల సంయుక్త విచారణను ముమ్మరం చేయూలని, అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని... లేనిపక్షంలో శిక్ష తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  

 కిందిస్థాయి సిబ్బందిపైనేనా...
 మరోవైపు ఇసుక మాఫియాలో కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని కీలక బాధ్యులను వదిలేస్తున్నారే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇసుక కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్న ఓ న్యాయవాది పరిమితులకు మించి ఇసుకను తవ్వుకున్నారు. ఇదివరకే  1,093 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించినట్లు సమాచారం. దీని విలువ రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నా... బహిరంగ మార్కెట్‌లో రూ. 4 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమంగా ఇంత పెద్ద మొత్తంలో ఇసుక తరలించడంపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement