వంద కొట్టు టోకెన్ పట్టు
Published Fri, Jan 3 2014 12:34 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
సాక్షి, చెన్నై: అధికారంలోకి వస్తే ఉచిత పథకాలు దరి చేరుస్తానంటూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, కుటుంబ కార్డుదారులకు ఉచిత గ్రైండర్, మిక్సీ, టేబుల్ ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా వీటి పంపిణీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పక్షం ఉచితాల పంపిణీని మరింత వేగవంతం చేసింది. దీంతో ఉచితాలను త్వరితగతిన తీసుకోవాలన్న ఆత్రుత కుటుంబ కార్డుదారుల్లో పెరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు అందజేస్తున్నారు. ఈ టోకెన్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాలకు వేలాదిగా జనం తరలి వస్తుండటంతో గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న రెవెన్యూ సిబ్బంది కొందరు తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. తమ చేతులను ఎవరు అయితే, తడుపుతారో వారికి త్వరితగతిన టోకెన్లను ఇచ్చేస్తున్నారు. చాప కింద నీరులా ఈ తంతు సాగుతూ వస్తున్నా, బహిరంగంగా బయటకు పొక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో తిరువాన్నీయూరులో గురువారం జరిగిన శిబిరంలో రెవెన్యూ సిబ్బంది బండారం బయట పడింది. జనం తిరగబడటంతో ఆ సిబ్బంది పరుగులు పెట్టాల్సివచ్చింది.
రూ.వంద కొట్టు: తిరువాన్నీయూరు పరిసరాల్లో బుధవారం నుంచి టోకెన్ల పంపిణీ సాగుతోంది. ప్రత్యేక శిబిరానికి జనం వేలాదిగా తరలి రావడంతో రెవెన్యూ సిబ్బంది తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. కుటుంబ కార్డుదారుల వివరాల్ని సేకరించి, ఇళ్ల వద్దకే టోకెన్లు తెచ్చి ఇస్తామంటూ పంపించేశారు. గంటల తరబడి క్యూలో బారులు తీరడం కన్నా, ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తే మంచిదేనన్న నిర్ణయంతో లబ్ధిదారులు వెనుదిరిగారు. గురువారం ఉదయం నుంచి రాజీవ్ గాంధీ నగర్, తిరువాన్నీయూరు కుప్పం, శ్రీనివాస నగర్ పరిసరాల్లో టోకెన్ల పంపిణీలో నిమగ్నం అయ్యారు. ఇంటింటికి వెళ్లి టోకెన్ ఇచ్చే క్రమంలో ముందుగా రూ. 100 తమకు ఇవ్వాల్సిందేనని వచ్చిన సిబ్బంది పేర్కొనడంతో లబ్ధిదారులు విస్తుపోయూరు. కొందరు చేతులు తడపగా, మరి కొందరు తిరగబడే పనిలో పడ్డారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే వచ్చిన ఉచిత పథకాలకు లంచమా..? అంటూ శివాలెత్తారు. టోకెన్లు ఇస్తే సరి అని గ దమాయించడంతో సిబ్బంది అక్కడి నుంచి ఉడారుుంచారు!. అయినా వెంటాడి మరీ శిబిరం వద్దకు వచ్చిన పలువురు లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం మీడియాకు చేరింది. ఉచితాలకు చేతులు తడిపే వ్యవహారం వెలుగులోకి రావడంతో సంబంధిత శాఖ వర్గాలపై సీఎం జయలలిత కొరడా ఝుళిపించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement