టీఆర్‌ఎస్‌లో వసూల్‌ రాజాలు | trs party serious on leaders who bribes | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో వసూల్‌ రాజాలు

Published Fri, Feb 2 2018 3:56 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

trs party serious on leaders who bribes - Sakshi

డబ్బులు తీసుకుంటూ వీడియోకి చిక్కి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన గుర్రంపల్లి యాదగిరి

రంగారెడ్డి/అత్తాపూర్‌: పార్టీ పేరు చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న కొందరు వసూల్‌ రా జాల విషయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీరియస్‌గా వ్యవహరిస్తుంది. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డదారిన సంపాదిస్తున్న వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారిని పార్టీ నుంచి స స్పెండ్‌ చేయడంతోపాటు చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడటం లేదు. తాజాగా జరుగుతున్న సంఘటనలే దీనికి ఉదాహరణ.... ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి అండగా ఉండి రెవెన్యూ సిబ్బందిని మేనేజ్‌ చేస్తానని డబ్బులు వసూలు చేసి సస్పెండ్‌కు గురైన అత్తాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు గుర్రంపల్లి యాదగిరిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి...

గుర్రంపల్లి యాదగిరి గత కొన్ని రోజులుగా అత్తాపూర్‌ డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి అనుమతులు లేవని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇదేక్రమంలో వారం రోజుల క్రితం అత్తాపూర్‌ భరత్‌నగర్‌ కాలనీలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి రూ. 25వేలు తీసుకున్నాడు. ఇందు కోసం రెవెన్యూ సిబ్బంది రాకుండా చూస్తానని నమ్మబలికాడు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాలలో రావడంతో అతడిని టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

మరుసటి రోజు రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆర్‌ఐ, వీఆర్వో గుర్రపల్లి యాదగిరిపై తమ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తన పేరును దేవాలయ శాఖ అధికారుల వద్ద వాడి బద్నాం చేశాడని అత్తాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు వనం శ్రీరామ్‌రెడ్డి, డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు తాము ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధారాలతో సహా గుర్రంపల్లి యాదగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. చేసిన నేరాలను అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జున్‌ తెలిపారు.  

తాజాగా మరొకరు...  
గుర్రంపల్లి యాదగిరి కథనం మరువక ముందే అధికార పార్టీకి చెందిన మరో నేత వీడియోకి చిక్కినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలకు పైగా డబ్బులు తీసుకున్నాడని అతడి వెన్నంటే ఉండే అనుచరుడు మ రో రూ. 10 వేలు తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ వీడియో రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా చేరినట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఆ నాయకుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధినాయకత్వం సిద్ధమవుతుంది. అతడే మరో రెండు చోట్ల కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిసిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. రేపో మాపో అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వస్తుందని నాయకులు పేర్కొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement