భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ
భూపాలపల్లి: సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లపై వీఆర్‌ఓలు, సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. లావాణి, పోడు భూములు, ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారికి ఈ పథకం వర్తించదన్నారు.
2014 జూన్ 2లోపు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని, అంతేకాక ఒక కుటుంబానికి ఐదెకరాల లోపు మాత్రమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వర కు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, ఆర్‌ఐ రహమాన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.