బయోమె‘ట్రిక్‌’తో బియ్యం మాయం | Kamareddy Police Filed Case Against Six Dealers And Revenue Staff | Sakshi
Sakshi News home page

బయోమె‘ట్రిక్‌’తో బియ్యం మాయం

Published Sun, Sep 6 2020 4:40 AM | Last Updated on Sun, Sep 6 2020 4:40 AM

Kamareddy Police Filed Case Against Six Dealers And Revenue Staff - Sakshi

సాక్షి, కామారెడ్డి: బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. కరోనా నేపథ్యంలో రేషన్‌ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్‌ విధానాన్ని నిలిపివేయడంతో బియ్యం దొంగలకు వరంగా మారింది. ఫలితంగా రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని అక్రమాలకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించిన బియ్యాన్ని కాజేస్తున్న వైనం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లను సేకరించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో బియ్యాన్ని దారి మళ్లించారు.

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల్లో కొందరు డీలర్లు మహబూబాబాద్, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందిన లబ్ధిదారుల పేరిట పెద్ద ఎత్తున బియ్యాన్ని తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఒక రేషన్‌ దుకాణం, బాన్సువాడ పట్టణంలో రెండు దుకాణాలు, బీర్కూర్‌ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, దామరంచ గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు డీలర్లతో పాటు సహకరించిన వీఆర్‌వో, వీఆర్‌ఏలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఐదుగురు వీఆర్‌ఏలను, ఒక వీఆర్‌వోను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా దుర్వినియోగం 
 ఈ దందా ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తుండగా.. అక్రమాలకు అలవాటు పడిన కొంత మంది రేషన్‌ డీలర్లు, మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త దారులు వెతికారు. బయోమెట్రిక్‌కు బదులు రెవెన్యూ సిబ్బంది ఆథరైజేషన్‌తో సరుకులు పంపిణీ చేస్తుండటంతో సిబ్బందిని మచ్చిక చేసుకుని లబ్ధిదారుల బియ్యాన్ని మింగేస్తున్నారు. అది కూడా ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి సంబంధించిన నెలనెలా మిగిలిపోతున్న బియ్యాన్ని మింగేశారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది.  

అక్రమాలకు హైదరాబాద్‌తో లింకు..! 
పొరుగు జిల్లాల లబ్ధిదారులకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని దుర్వినియోగం చేసే మాఫియాకు హైదరాబాద్‌తో లింకు ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం మాఫియా ఎంచుకున్న కొన్ని రేషన్‌ దుకాణాల ద్వారా అక్కడి సిబ్బందిని మేనేజ్‌ చేసుకుని ఇతర జిల్లాల లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని కాజేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోని మాఫియా, యంత్రాంగం అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లు రాజధాని నుంచే డీలర్ల వాట్సాప్‌లకు వచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల అధికారులు ఇతర జిల్లాలపై దృష్టి సారించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement