రాజు రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 48 గంటల  నరకయాతన నుంచి విముక్తి | Rescue Team Saved Chada Raju Who Stuck Between Rocks At Kamareddy | Sakshi
Sakshi News home page

రాజు రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 48 గంటల  నరకయాతన నుంచి విముక్తి

Published Fri, Dec 16 2022 1:50 AM | Last Updated on Fri, Dec 16 2022 1:50 AM

Rescue Team Saved Chada Raju Who Stuck Between Rocks At Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి/ కామారెడ్డి టౌన్‌: రెండు పెద్ద బండరాళ్ల మధ్య.. దాదాపు 48 గంటల పాటు.. ఎటూ కదల్లేని మెదల్లేని పరిస్థితి.. రాత్రివేళ మరీ నరకయాతన. బయట పడతానో లేదో అన్న సందిగ్ధం. కానీ ధైర్యం కోల్పోలేదు. రెండు రాత్రిళ్లు గడిచాయి. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆ నరకం నుంచి విముక్తి. అధికారులు, సిబ్బందిలో ఒకరి ప్రాణాలు కాపాడగలిగామనే సంతృప్తి..కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన సంతోషం. గుట్టల్లో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు గురువారం క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు, బంధువులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 

వేటకు వెళ్లి..బండరాళ్ల మధ్య చిక్కి.. 
మంగళవారం రెడ్డిపేట–సింగరాయపల్లి రోడ్డులో గన్‌పూర్‌ (ఆర్‌) తండాకు సమీపంలోని పులిగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లిన చాడ రాజు.. రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఏదులు, ఉడుములు పట్టుకోవడంలో దిట్ట అయిన రాజు.. ఉడుమును పట్టుకునే క్రమంలోనే బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కాగా రాజు వెంట వెళ్లిన అతని స్నేహితుడు సున్నపు మహేశ్‌.. అతన్ని బయటకు లాగేందుకు చాలాసేపు విఫలయత్నం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏ ఇబ్బంది ఎదురవుతుందోనని మహేశ్‌ భయపడ్డాడు. ఆ రోజు రాత్రంతా రాజుతో మాట్లాడుతూ అక్కడే రాతి గుండుపై ఉండిపోయాడు. బుధవారం ఉదయం ఇక లాభం లేదనుకుని గ్రామంలోని తమ మిత్రులు కొందరికి విషయం చెప్పాడు. వారు కూడా అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేశారు. రాజు కూడా బయటకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచాడు. కానీ ఫలించలేదు. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.  

పోలీసు, రెవెన్యూ, అటవీ సిబ్బంది సమష్టిగా.. 
రామారెడ్డి ఎస్సై అనిల్‌ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలోని గుట్టల వద్దకు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెంటనే అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్‌లతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని పంపించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వచి్చన పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సహాయ సిబ్బంది.. రాజును రక్షించేందుకు గుట్టను తవ్వే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో స్థానిక యువకుల్ని అప్పుడప్పుడు రాజుతో మాట్లాడిస్తూ ధైర్యం చెప్పారు. ముఖ్యంగా అశోక్‌ అనే రాజు మిత్రుడు అతని సమీపం వరకు వెళ్లి నీళ్లు, పండ్ల రసాలు అందించడంలో సాయపడ్డాడు. లోపల ఉక్కపోత నుంచి కాపాడేందుకు చార్జింగ్‌ ఫ్యాన్‌ను లోనికి పంపించారు. బుధవారం రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు. 

జేసీబీతో, రాళ్లను బ్లాస్ట్‌ చేస్తూ.. 
పులిగుట్ట మొత్తం పెద్దపెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాళ్ల మధ్యన ఇరుక్కున్న రాజును రక్షించేందుకు మొదట జేసీబీ సాయంతో ప్రయతి్నంచారు. తర్వాత రాళ్లకు డ్రిల్లింగ్‌తో రంధ్రాలు చేసి పేలుడు మందు నింపి బ్లాస్టింగ్‌ చేశారు. ఈ విధంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 12 సార్లు బండరాళ్లను కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ (పెద్ద రాళ్ల ముక్కలు రాజు మీద పడకుండా తక్కువ మోతాదు పేలుళ్లు) చేశారు. బ్లాస్ట్‌ చేసిన రాళ్లను తొలగించేందుకు జేసీబీని వినియోగించారు. ఈ క్రమంలో రాజుతో వీలైనన్నిసార్లు మాట్లాడుతూ అధైర్యపడవద్దని చెప్పారు. రాళ్లు రాజుపై పడకుండా అడ్డుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 గంటల ఆపరేషన్‌ తర్వాత ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజును బయటకు తీయగలిగారు. దీంతో దాదాపు 48 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.  

పక్కా ప్రణాళికతో..చాకచక్యంగా.. 
రెస్క్యూ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ స్వ యంగా పర్యవేక్షించారు. బండరాళ్లు పేల్చడం ఒక రకంగా అధికారులు చేసిన సాహసమేనని చెప్పాలి. అందుకనే ఈ తరహా పేలుళ్లలో అనుభవజు్ఞడైన కామారెడ్డికి చెందిన పెంటయ్యతో పాటు అతని బృందాన్ని పిలిపించారు. తక్కువ పరిమాణంలో మందుగుండు అమర్చుతూ పేలుళ్లు జరిపారు. పొరపాటున భారీ విస్ఫోటనం జరిగితే లోపల ఇరుక్కున్న రాజుకు అపాయం జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.  రెస్క్యూ ఆపరేషన్‌లో 80 పాల్గొన్నారు. 

ఆస్పత్రిలో 24 గంటల అబ్జర్వేషన్‌ 
రాజును అధికారులు తక్షణమే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. రెండురోజుల పాటు సరైన ఆహారం లేకపోవడంతో శరీరంలో షుగర్‌ శాతం తగ్గిన్నట్లు గుర్తించారు. ఎడమ చేతికి వాపు వచి్చంది. బండరాళ్ల మధ్య కదలడంతో రెండు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. అతని ధైర్యమే అతన్ని కాపాడిందని డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ చెప్పారు. 

అధికారులు దేవుళ్లలాగా వచ్చారు.. 
పడిపోయిన సెల్‌ఫోన్‌ తీసుకోవడానికి వెళ్లి రాళ్లలో తలకిందులుగా ఇరుక్కుపోయా. అయినా ధైర్యంగానే ఉన్నా. నేను ఎవ్వరికీ భయపడను.. ఒక్క దేవుడికి తప్ప. అయితే బండరాళ్ల మధ్య నరకం అనుభవించా. కానీ మా వాళ్లకు ధైర్యంగా ఉండాలని, నాకు ఏం కాదని చెప్పా. రాళ్లు పేల్చుతుంటే మాత్రం కొంచెం భయం వేసింది. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవె న్యూ, అటవీ, వైద్య శాఖల అధికారులు దేవుళ్లలాగా వ చ్చారు. చాలా కష్టపడి నన్ను బయటకు తీశారు. వాళ్లందరికీ నేను చనిపోయేంత వరకు రుణపడి ఉంటాను.  – రాజు  

అందరికీ రుణపడి ఉంటా.. 
మా ఆయన్ను ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడ్డా. అసలు బయటకు వస్తాడా..బతుకుతాడా?.. నా పిల్లలు, నా పరిస్థితి ఏందని ఏడ్చాను. గుండె ఆగిపోయినంత పని అయింది. సార్లు, డాక్టర్లు అందరూ వచ్చి రెండ్రోజులు కష్టపడి నా భర్తను బతికించారు. అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా.     – లక్షి్మ, రాజు భార్య

బయటికి వస్తాడో లేడో అని అని్పంచింది
రాజు రాళ్ల మధ్యలో పడ్డాడని నాకు చెప్పారు. నేను వెళ్లి బయటకు తీయడానికి చాలాసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తర్వాత భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అందరూ వచ్చి కష్టపడి రాజన్నను బతికించారు. పరిస్థితి చూస్తే అసలు బయటికి వస్తాడో లేడో అని భయం వేసింది. అతని బాధ చెప్పలేను. కానీ రాజు చాలా ధైర్యంగా ఉన్నాడు.      – అశోక్, రాజు మిత్రుడు 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement