‘రియల్’దందా..! | 'Real' danda ..! | Sakshi
Sakshi News home page

‘రియల్’దందా..!

Published Fri, Jun 17 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

‘రియల్’దందా..!

‘రియల్’దందా..!

 జిల్లా కేంద్రం శ్రీకాకుళమైనా, మండల కేంద్రం పాతపట్నమైనా... మరే పట్టణంలోనైనా.. మూడు సెంట్లు స్థలం దొరికితే సొంత ఇల్లు కట్టుకోవాలని భావించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో సొంత జిల్లాలో ప్లాట్ కొనుక్కోవాలని ఆశ పడేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ పరిస్థితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారగా...కొంతమంది అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

వారితో కుమ్మక్కయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకూ ముడుపులు బాగానే ముడుతున్నాయి. ఫలితంగా విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అందమైన బ్రోచర్లు చూసి, బ్రోకర్ల మాటలు విని వాటిని కొనుక్కున్నవారంతా నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి వ్యవహారానికి పాతపట్నంలో వెలుగు చూసిన వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం.
 

 
 
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం పరిసరాల్లో సుమారు 30 వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశారుు. ఈ సంస్థలు వేసిన లేఅవుట్లలో ప్రభుత్వ భూములున్నాయి. ఇలా దాదాపు 27 ఎకరాల భూమి ఇటీవల కాలంలో కబ్జా అయిపోయింది. ఈ అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. వారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను నయానో, భయానో లొంగదీసుకొని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి లేఅవుట్ల కింద మారిపోయింది. ఇందులో చాలావరకూ గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములు ఉన్నాయి. వాటిని విక్రయించే హక్కులేకున్నప్పటికీ రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అండతో లాక్కొంటున్నారు. వాటిని పక్క సర్వే నంబర్ల ఆధారంగా వారసత్వ భూములుగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేస్తున్నారు.


 పోరంబోకు భూమికి ఎసరు
 ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన పాతపట్నం పరిసర గ్రామాలకు చెందినవారు, అలాగే పరిసర గిరిజన గ్రామాల్లో ఉద్యోగాలు చేస్తూ పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం తదితర అవసరాల కోసం పాతపట్నంలో నివాసం ఉంటున్నవారు రియల్ ఎస్టేట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండుకు తగ్గట్లుగా కొందరు అధికార పార్టీ నాయకులు, ముఖ్యనేతల అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తారు. పాతపట్నం పరిసరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా, ప్రభుత్వ భూములపై కన్నేశారు. వాటి పక్కనే జిరాయితీ భూములు కొనుగోలు చేసి, ఆ ముసుగులో ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. ఉదాహరణకు ప్రహరాజుపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 32లో కొంతమంది రైతులకు జిరాయితీ భూమి ఉంది. దాన్ని కొనుగోలు చేసిన ఓ రియల్‌ఎస్టేట్ సంస్థ ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి సర్వే నంబరు 32/1/ఎగా సబ్‌డివిజన్ చేసి 1.83 ఎకరాలను కాజేశారు. దీన్ని వారసత్వ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై కొంతమంది గ్రామస్థులు ఎన్‌కంబరేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా... అసలు ఆ సర్వే నంబరు, సబ్‌డివిజన్ లేదని అధికారులు ధ్రువీకరించారు.
 
 
 
 అధికారులు గుర్తించినవి కొన్నే
 కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 30లో 1.53 సెంట్లు, సర్వే నంబరు 31లో పోరంబోకు గయ్యాలు 60 సెంట్లు, సర్వే నంబరు 33లోని జగ్గయ్య కోనేరు 2.56 ఎకరాలు, అలాగే రంకిణి పంచాయతీ చిన్నపద్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 3లో 55 సెంట్లు ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందంతా కలిపి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో ఐదో వంతు కూడా లేదు. సర్వే నంబరు 31లో 1.50 ఎకరాలు, 32లో 2.56 ఎకరాలు, 35లో 3.89 ఎకరాలు, 35/2లో 21 సెంట్లు, 35/3లో 24 సెంట్లు, 35/4లో 87 సెంట్లు, 35/5లో 1.04 ఎకరాలు, 36లో 6.78 ఎకరాలు, 36/1లో 5.18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌ల్లో కలిసిపోయాయి. సుమారు 22 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి విలువ రూ.10 కోట్లు పైమాటే.
 
 
 ‘కమీషన్’ కక్కుర్తి

 డీ పట్టా ఆధారంగా ప్రభుత్వ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వారిని బుట్టలో వేసి భూమిని అప్పగించిన బ్రోకర్లకు ఎకరాకు రూ.లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ కమీషన్‌ను రియల్ వ్యాపారులు ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుండటంతో కొంతమంది బ్రోకర్లు రియల్ వ్యాపారులుగా మారిపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. పాతపట్నం పరిసరాల్లో వెలిసిన చాలా లేఅవుట్లకు పంచాయతీ అఫ్రూవల్స్ లేవు. ప్లానులు, అనుమతులూ లేవు. భూమార్పిడి రుసుం చెల్లించిన దాఖలాలు లేవు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు.
 
 
 
 ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం
 కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి వేసిన వెంచర్లను గుర్తించాం. ఆయా లేఅవుట్‌ల్లో సర్వే చేయించాం. రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని తొలగించాం. రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి.  -ఎన్.దాలినాయుడు, తహసీల్దారు, పాతపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement