రెవెన్యూ జేబుకు చిల్లు
► అతీగతీ లేని ప్రొటోకాల్ నిధులు
► రూ. కోటి విడుదల చేశామని ప్రకటించిన ప్రభుత్వం
► అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది
► తీర్చే మార్గం కనిపించక ఆందోళనస
గుంటూరు ఈస్ట్ : మహా సంకల్పం నుంచి నేటి వరకు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రెవెన్యూ సిబ్బంది భుజస్కందాలపై వేసుకుని పని భారంతో పాటు ఆర్థిక భారం వారే భరించి విజయవంతం చేశారు. ప్రొటోకాల్ ఖర్చుల కింద జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేశామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటి వరకు ఒక్క రూపాయి కూడా రెవెన్యూ సిబ్బందికి అందకపోవడంతో వారు ఆందోళన లో పడ్డారు. రాజధాని కేంద్రమైన నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో రాష్ర్టస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి జిల్లాలో పర్యటిస్తున్నారు.
దీంతో ప్రొటోకాల్ నిమిత్తం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై పడింది. కొన్ని కార్యక్రమాలు రెండు రోజులకు ముందే ఖరారవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ స్థాయి సిబ్బందికి అన్ని పనులు పురమాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశిస్తారే కానీ, ఆర్థిక సహకారం ఇవ్వరు. అధికారులు,సిబ్బంది ఆ వారం రోజులు రాత్రనక పగలనక పని చేయడంతో పాటు ప్రొటోకాల్ ఖర్చులన్నీ వారే భరించాల్సి వస్తోంది. గతంలో సంవత్సరానికి మూడు పెద్ద కార్యక్రమాలు జరిగేవి. అప్పుడప్పుడు మంత్రులు వచ్చినప్పుడు కొంత ఖర్చు ఉండేది.
ఇది వారికి పెద్ద భారమయ్యేది కాదు. మహా సంకల్పం, క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన, తెనాలి రైతు సదస్సు వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించిందే కానీ, వాటికి సంబంధించి ప్రొటోకాల్ నిధులు ఒక్క పైసా రెవెన్యూ సిబ్బందికి చెల్లించలేదు. వీటికి తోడు శాసనసభాపతి, జిల్లాకు చెందిన మంత్రులు,ఇన్‌చార్జి మంత్రి జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. రాజధాని కావడంతో ఇతర మంత్రులు, సీఆర్డీఏ నేపథ్యంలో విదేశీ అతిథులు జిల్లాకు వస్తున్నారు. ఇటీవల టీడీపీ మహిళా విభాగం నాయకురాలి ప్రమాణ స్వీకారానికి ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ సిబ్బందే భరించాల్సి రావడంతో వారు ఆవేదనకు గురైనట్లు వార్తలొచ్చాయి.
గొంతెమ్మ కోర్కెలు..
ఒక్కో అతిథికి ఒక్కో అలవాటు. రెవెన్యూ సిబ్బందికి అతిథుల గొంతెమ్మ కోర్కెలు శిరోభారంగా మారాయి. ఓ అతిథి ఉదయాన్నే సమోసాలు కోరగా, మరో అతిథి న్యాప్‌కిన్ టవల్స్ తిరస్కరించి అప్పటికప్పుడు కొత్త న్యాప్‌కిన్ టవల్స్ కోరారు. ఉదయం సాయంత్రం భోజనాలే కాక ఫలహారాలతో పాటు ఇతర వ్యసనాలకు కూడా సిబ్బంది పరుగులు తీయాల్సి వస్తోంది.
నిధులు ఏమైన ట్టు..
అసలు ప్రభుత్వం విడుదల చేసిన కోటి రూపాయలు ప్రొటోకాల్ నిధులు ఏమయ్యాయనేది రెవెన్యూ సిబ్బందిని కొంతకాలంగా తొలుస్తున్న ప్రశ్న. ప్రభుత్వం ప్రకటించడమే కానీ విడుదల చేయలేదా? విడుదలైన నిధులను వేరే పనులకు మళ్లించారా? అసలు ఆ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క రెవెన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ప్రొటోకాల్ నిధులొచ్చినప్పుడు తీర్చవచ్చని అప్పుగా తెచ్చిన డబ్బు ఇప్పుడు ఎలా తీర్చాలా అని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ ఖర్చులు చెల్లించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.