‘రద్దు’పై ఐక్య ఉద్యమాలు జేఏసీగా ఏర్పాటు | Revenue Staff Of The State Opposing Telangana Govt Decision | Sakshi
Sakshi News home page

‘రద్దు’పై ఐక్య ఉద్యమాలు జేఏసీగా ఏర్పాటు

Published Wed, Apr 17 2019 3:33 AM | Last Updated on Wed, Apr 17 2019 3:33 AM

Revenue Staff Of The State Opposing Telangana Govt Decision - Sakshi

మంగళవారం రెవెన్యూ భవన్‌లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో మాట్లాడుతున్న సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ శాఖను స్వతంత్రంగా, ఇప్పుడున్న విధంగానే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తే ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం సీసీఎల్‌ఏ కార్యాలయ ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వీఆర్‌వో, వీఆర్‌ఏ సంఘాలన్నింటినీ కలుపుకొని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాఖ భవిష్యత్తు, సీఎం కేసీఆర్‌ చెబుతున్న కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవె న్యూ శాఖను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగ సంఘాల అభి ప్రాయాలు తీసుకున్నారు. జేఏసీగా ముందుకెళ్లడంతోపాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను బుధవారం కలిసి పరిస్థితిని కూలంకషంగా వివరించాలని, ఆయన్ను కలిశాకే భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు.

ప్రతి శాఖలోనూ అవినీతి.. తెలంగాణను అవినీతిరహితంగా మార్చాలంటే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా అని నేతలు ప్రశ్నించారు. ‘ఏ శాఖ లో అవినీతి లేదు? అన్ని శాఖల్లో అవినీతి, అలసత్వ ఉద్యోగులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేశారని పొగిడి నెల జీతం బోనస్‌గా ఇచ్చిన సీఎం.. ఇప్పుడు మమ్మల్ని బద్నామ్‌ చేయడం ఎంత వరకు భావ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 94 శాతం రికార్డులను నవీకరించినా ఒక్క రైతు నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులపై నిందలు మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘మనిషి జననం నుంచి మరణం వరకు రెవెన్యూశాఖదే కీలక పాత్ర. ఇది ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఎన్నో సేవలు చేస్తున్న రెవెన్యూ శాఖను అవినీతి శాఖగా చిత్రీకరించడం శోచనీయం’ అని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. కొన్ని శాఖలు తెలంగాణ కోసం అదనంగా 2 గంటలు పనిచేస్తామని చెప్పి కేవలం రెండు గంటలే పనిచేస్తున్నా కన్నెత్తిచూడకుండా నిరంతరం పాలనా వ్యవహారాల్లో తలమునకలయ్యే రెవెన్యూ శాఖను రద్దు చేసే ఆలోచన చేయడమేమిటని ప్రశ్నించారు.

రెవెన్యూశాఖ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు
రెవెన్యూ శాఖ పరిరక్షణ కోసం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా వంగా రవీందర్‌రెడ్డి (ట్రెసా), సెక్రటరీ జనరల్స్‌గా గరిక ఉపేందర్‌రావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), గోల్కోండ సతీష్‌ (వీఆర్వోల సంఘం), కో చైర్మన్‌గా విజయరావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), రమేశ్‌ బహదూర్‌ (డైరెక్ట్‌ రిక్రూటీ, వీఆర్‌ఏ సంఘం), రాజయ్య (వీఆర్‌ఏల సంఘం), కోశాధికారిగా నారాయణరెడ్డి (ట్రెసా), కన్వీనర్‌గా చంద్రమోహన్‌ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం)లను ఎన్నుకున్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలను స్వాగతించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.

రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం సరికాదు...
సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మంచిదే. కానీ కొత్త చట్టం పేరిట రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఆలోచన సరికాదు. రెవెన్యూ పనులను ప్రైవేటుకు అప్పగిస్తే వ్యతిరేకిస్తాం. భూ సమగ్ర సర్వే చేసి హద్దు రాళ్లు నాటిన తర్వాతే ప్రక్షాళన చేస్తే రెవెన్యూ సమస్యలకు ఆస్కారం ఉండేది కాదు. భూమి ఒకరిది, రికార్డులో మరొకరిది ఉన్న కేసులు చాలా ఉన్నాయి. నిపుణుల కమిటీ వేసి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే రెవెన్యూ వివాదాలకే తావుండేది కాదు. ధరణి వెబ్‌సైట్‌ను తహసీల్దార్‌ ఫ్రెండ్లీగా మార్చాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘టాస్‌’ను వ్యతిరేకిస్తున్నాం. దాని వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయి. మంత్రులకు సర్వాధికారాలు ఇవ్వడం సీఎం ఇష్టం. కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల అందరికీ లాభం జరుగుతుంది.
– వంగా రవీందర్‌ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement