చీరాల, న్యూస్‌లైన్ : టన్నులకొద్దీ ఇసుకతో రోజుకు 350 నుంచి 400 లారీలు వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల నుంచి అక్రమంగా తరలి వెళ్తుంటాయి. ఇది రోజూ జరిగే తంతే. ఇదేదో చాటుమాటున జరిగే వ్యవహారం కూడా కాదు. బహిరంగంగా, బరితెగించి పగలు..రాత్రి అన్న తేడా లేకుండా ఇసుక దిబ్బలను కొన్నేళ్లుగా కొందరు అక్రమార్కులు తోడేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తుగా ఉండే ఇసుక దిబ్బలు ఇప్పుడు ఇరవై అడుగుల లోతుగా మారి నీటి కుంటలయ్యాయి. వాల్టా చట్టం చట్టుబండలైంది. కేవలం శాస్త్రీ్తయ్ర పద్ధతి ద్వారా సిలికా ఇసుకను తవ్వుకునేందుకు మాత్రమే కొద్ది మందికి అనుమతి ఉంది. అదీ కూడా కొన్ని ఎకరాల పరిధిలో మాత్రమే. కానీ వేటపాలెం, చినగంజాం, చీరాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలను తవ్వేశారు.
ఈ అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన బడా నేతలతో పాటు అనేక మంది అండగా ఉన్నారు. ఇన్నాళ్లూ అధికారులెవరూ దాడులు చేసిన దాఖలాలు లేవు. రోజూ వందల సంఖ్యలో వెళ్తున్న లారీలను వదిలి అప్పుడప్పుడు ఒకటో రెండో ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధించి డాబుగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌ల్లో నీరు చేరడంతో అందరూ ఈ ప్రాంతంపై పడ్డారు. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత అన్నట్లుగా అడ్డగోలుగా ఇసుకను తవ్వేశారు. పోలీసుస్టేషన్‌కు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఠంచన్‌గా మామూళ్లు ముట్టాయి. ఇవి కాక లారీలు వెళ్లే సమయంలో ఆపిన పోలీస్ సిబ్బందికి, ఇతర అధికారులకు దారి పొడవునా మామూళ్లు ముట్టచెప్పి లారీలు బయల్దేరేవి. ఈ వ్యవహారం కొన్నేళ్ల పాటు జరిగిపోయింది. పత్రికలు కోడై కూశాయి.
ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. దొంగలు పడిన ఆరు నెలలకు.. అన్న చందంగా భారీ ఎత్తున తర్వాత ఏమైందో ఏమో కానీ మేము నిద్ర లేచింది ఇప్పుడే అన్నట్లుగా వేటపాలెం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇసుక తవ్వకాలపై దాడులు జరిపారు. జిల్లా అధికారుల అదేశాల మేరకు మండల పరిధిలోని పందిళ్లపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పది లారీలు, మూడు ట్రాక్టర్లను అధికారులు శనివారం పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. లారీలకు, ట్రాక్టర్లకు జరిమానా విధించాల్సిందిగా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ రాజేశ్, వీఆర్వోలు సత్యనారాయణ, ఎస్సై అంకబాబు పాల్గొన్నారు.