ఇసుమంత భయం లేదు
చీరాల : ఇసుక అక్రమ రవాణా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో జోరందుకుంది. కొన్నేళ్ల నుంచి తీరప్రాంతాన్ని కండబలంతో కబళిస్తున్నా అరికట్టాల్సిన సంబంధితాధికారులు రాజకీయ అండను చూసి ప్రేక్షకపాత్ర వహించడంతో అడ్డూ అదుపూ లేకుండా తరలిపోతోంది. చీరాల టూ హైదరాబాద్ పేరుతో రోజూ భాగ్యనగరానికి వందల సంఖ్యలో ఇసుక లారీలు తరలివెళ్లడంతో ఈ ప్రాంతంలోని ఇసుక దిబ్బలన్నీ కాలువలుగా మారిపోయాయి. తీరప్రాంతంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఇందుకు సహకరించిన కొంతమంది పోలీస్ అధికారులు, సిబ్బందిపై వేటుపడినా ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించినవారు కూడా పాతవారి బాటే పట్టడంతో అక్రమార్కులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. టీడీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను నిషేధించినా రాజకీయ నేతల అండదండలతో రోజూ వందల లారీలు వరుసకడుతున్నాయి. అప్పుడప్పుడు పట్టుకున్నట్టు హడావుడి చేసినా తరువాత వదిలేయడం రివాజుగా మారిపోయింది.
నిషేధం తరువాత రెట్టింపైన ధర : రూ.15 వేల నుంచి 20 వేలు ఉండే లారీ ఇసుక నిషేధం అనంతరం రెట్టింపైంది. ఇసుక రవాణా నిలిచిపోయిందని, ఇసుక పంపడం సాధ్యం కాదంటూనే అధిక ధర ముట్టచెబితే చూస్తామంటూ బేరాలకు దిగుతున్నారు. దూరాన్ని బట్టి ధరలో మార్పులుంటాయి. హైదరాబాదైతే లారీ ఇసుకను రూ.40 వేలకు అందిస్తున్నారు. గతంలో మాదిరిగా బైపాస్, హైవేపై కాకుండా వేటపాలెం, చినగంజాం మండలాల్లోని ఇసుక అక్రమ రవాణాదారులు పందిళ్లపల్లి, తిమ్మసముద్రం ప్రాంతాల మీదుగా ఇసుకను లారీల్లో నింపి రవాణా చేస్తున్నారు.
గతంలో రూ.600 ఉండే టైరుబండి ఇసుక ప్రస్తుతం రూ.1200లకు చేరింది. రూ.1500 ఉండే ట్రాక్టర్ ఇసుక రూ. 4000 చేరింది. రూ.20,000 ఉండే టర్బో లారీ ఇసుక రూ.40,000 చేరింది. ఈపూరుపాలెం, బోయినవారిపాలెం నుంచి రోజుకు వందల ట్రాక్టర్లలో చీరాల, పరిసర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇసుక వీరుడిగా పేరున్న ఓ మాజీ సర్పంచి ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
నిలిచిన నిర్మాణాలు
జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లున్నాయి. ప్రభుత్వం నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే ఇసుక రీచ్‌లను లాటరీల ద్వారా మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. మైదాన ప్రాంతాలతోపాటు ఇసుక పొలాల్లో అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు మండలాల్లో ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో కళ్లెదుటే ఇసుక ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి నెలకుంది. నిర్మాణాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, భవన సముదాయలు, రోడ్లు, ప్రైవేటు గృహాల నిర్మాణాలు అర్థంతరంగా నిలిచిపోయాయి.
డేగరమూడి వాగులోనూ...
డేగరమూడి(మార్టూరు): మార్టూరు మండలం డేగరమూడి గ్రామం వద్ద పర్చూరు వాగుకు ఇటీవల వరదతో భారీగా ఇసుక కొట్టుకురావడంతో అక్రమార్కుల కన్న పడింది.మంగళవారం వాగులో పొక్టయిన్‌తో తవ్వకాలు మొదలు పెట్టారు..పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు నకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని చేలలోని మట్టిని, గ్రావెల్‌ను ఇళ్లకు, రోడ్లకు తొలుకుంటేనే లక్షల రూపాయల జరిమానాలు విధించే మైనింగ్, విజిలెన్స్ అధికారులు కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుంటే ఏమి చేస్తున్నారని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.