ఇసుక గోతుల్లో నిఘా పాతర ! | Sand Reich Geo-fencing set up | Sakshi
Sakshi News home page

ఇసుక గోతుల్లో నిఘా పాతర !

Published Wed, Dec 24 2014 12:55 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఇసుక గోతుల్లో నిఘా పాతర ! - Sakshi

ఇసుక గోతుల్లో నిఘా పాతర !

 ఇసుక కొత్త విధానం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. పాత నేతల స్థానంలో కొత్తనేతలు పుట్టుకొచ్చారు. గతంలో కంటే ఇసుకాసురులు మరీ రెచ్చిపోతున్నారు. తమ మాటకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.  మీరెన్ని నిబంధనలు విధించినా మమ్మల్ని ఆపలేరని సవాల్ విసురుతున్నారు. నిఘా కరువు అవడంతో రీచ్‌లు అక్రమాలకు అడ్డాలుగా మారాయి.   జియో ఫెన్సింగ్ విధానం అమలులోకి రాకపోవడంతో నిఘా వ్యవస్థ నీరుగారింది. అధికారులు కూడా అచేతనంగా  ఉండిపోతున్నారు.  
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ఇసుక రీచ్‌ల వద్ద జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అధికారులు గొప్పగా ప్రకటించారు. రిజిస్టర్ చేసిన వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చి,  అధునాతన జియో ఫెన్సింగ్ సిస్టమ్‌ను అటు పోలీసు స్టేషన్, ఇటు డీఆర్‌డీఏ తదితర విజిలెన్స్ శాఖలకు అనుసంధానం చేస్తామని,  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ ఇసుక రీచ్‌ల వద్ద అడ్డగోలు వ్యవహారాలు, అక్రమ తవ్వకాలు, అనధికార తరలింపునకు బ్రేక్ వేసేందుకు దోహదపడతాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఉన్న ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నామన్నారు.  కానీ ఇవేవీ అమలుకు నోచుకోలేదు. రీచ్‌లు ప్రారంభమై నెలలు గడుస్తున్నా వాటి ఊసేలేదు.  దీంతో  నిఘాయే లేకుండా పోయింది.
 
 అంతే...  అధికార పార్టీ అండదండలున్న వారికి, అక్రమార్కులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.  డ్వాక్రా సంఘాల ద్వారాా రోజుకు తొమ్మిది గంటల పాటు ఇసుక విక్రయాలు జరుగుతుండగా, ఇసుక మాఫీయా ద్వారా రోజుకు 12 గంటల పాటు విక్రయాలు సాగుతున్నాయి. డ్వాక్రా సంఘాల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల దందా చేస్తున్నారు.  దీంతో ప్రభుత్వానికొచ్చే ఆదాయం కన్నా పదింతలు అక్రమార్కులు దోచుకుంటున్నారు.  అధికారుల ఉదాసీనతో...తమ నేతల సంపాదన కోసం చూసీ చూడనట్టు సర్కార్ వదిలేయమందో  లేదో  తెలియదు గాని, నిఘా లేకపోవ డంతో జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది.
 
 ఇప్పుడెక్కడ చూసినా ఇసుకే హాట్ టాపిక్ మారింది.  ఆ మధ్య ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం కాగా,  ఇప్పుడు కోట్లాది రూపాయల ఇసుక అనధికారికంగా తరలిపోతుండడంతో చర్చనీయాంశమైంది.  జిల్లాలో ప్రతీచోట అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. పగటి పూట కన్న రాత్రి పూట అనధికార తరలింపు ఎక్కువగా జరిగిపోతోంది. దీనికంతటికీ నిఘా లేకపోవడమే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతల్ని ఆ రీచ్ సరిహద్దు గ్రామాల గ్రామైక్య సంఘాలతో ఏర్పడిన మేక్ సొసైటీలకు అప్పగించారు. అయితే,   మేక్ సొసైటీల్లో సభ్యులుగా ఉన్న గ్రామైక్య సంఘాల ప్రతినిధుల్లో చాలా వరకు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని తెలుస్తోంది.  మొత్తానికి  సొసైటీలను ముందు పెట్టి తెరవెనుక నాయకులు కథ నడిపిస్తున్నారు. దీనికి తోడు   రీచ్‌లు పొందిన పలు మేక్ సొసైటీల్లో చాలా మంది సంతకం చేయలేని వారే సభ్యులుగా ఉన్నారు. మేక్ సొసైటీ బైలాలో ఉన్న అంశాలన్నీ ఇంగ్లిషులో ఉండగా, అందులో సభ్యులు నిశానీలుండటం ఆశ్చర్యమేస్తోంది. అంటే అందులో ఉన్నదేంటో వారికి తెలియని పరిస్థితి నెలకొంది. తాము చెప్పినట్టు జరగాలంటే ఇలాంటి వారే ఉండాలనుకున్నారేమో మరి....
 
 నింబంధనలకు తిలోదకాలు...
  జిల్లాలో ప్రారంభమైన 19 రీచ్‌లలో  నిబంధనల మేరకు ఉదయం  9 నుంచి సాయంత్రం 6గంటల వరకే తవ్వకాలు, రవాణా జరగాలి. కానీ పలు రీచ్‌లలో రాత్రిపూట కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరిగిపోతున్నాయి. దీనివెనుక ఎవరున్నారో ఆ రీచ్‌ల వద్దకెళ్లి అడిగితే కచ్చితంగా తెలిసిపోతుంది.
 
 రీచ్‌ల నిర్వాహకులైన మేక్ సొసైటీ ప్రతినిధులను అడిగితే మాత్రం తాము  పగలైతే  చూడగలం గాని రాత్రిపూట ఏం చేయగలమని చెప్పుకొస్తున్నారు. ఇక లారీలకు ప్రవేశం లేదన్న నిబంధనలున్నా ఇసుకతో తరలిపోతున్న లారీలు కోకొల్లులగా కన్పిస్తున్నాయి.  డీడీ లేదా మీసేవలో సొమ్ము జమ చేసిన రోజునే వినియోగదారునికి ఇసుక సరఫరా చేసేలా రీచ్‌ల వద్ద వే బిల్లులు జారీ చేయాలి. రీచ్‌కు, వినియోగదారుడి నివాస ప్రాంతానికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఫలానా సమయంలోగా రవాణా చేయాలంటూ వే బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.  కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది.  ఒకే వే బిల్లుతో లెక్కకు మించి లోడ్‌లు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికంతటికీ వే బిల్లులో పేర్కొన్నట్టుగా రోజు, సమయం ప్రకారం  ఇసుక రవాణా జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది.  రీచ్‌ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారానే ఇసుక సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఆ స్థాయిలో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. చాలా రీచ్‌లలో అనధికార వాహనాలతోనే ఇసుక తరలింపు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  
 
  రీచ్‌ల వద్ద నిఘా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీల ద్వారా రీచ్ లావాదేవీలు, రవాణాపై కన్నేసి ఉంటే అక్రమాలకు అడ్డుకట్ట పడేది. కానీ అటువంటిదేమీ లేకపోవడంతో అక్రమార్కుల ఇష్టారాజ్యంగా మారింది.  ఇసుక రీచ్‌ల్లో జరిగే  అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జియో ఫెన్సింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆ మధ్య అధికారులు చెప్పారు.   అక్కడ జరిగే కార్యకలాపాల దృశ్యాలు ఎప్పటికప్పుడు నిక్షిప్తమయ్యే టెక్నాలజీని అమర్చుతామని, ఇసుక రవాణా కోసం రిజిస్టరైన ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలకు జీపీఎస్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయనున్నామని,  అధునాతన జియో పెన్సింగ్ సిస్టమ్‌ను అటు పోలీసు స్టేషన్‌కు, ఇటు డీఆర్‌డీఎ తదితర విజిలెన్స్ శాఖలకు లింకు కలపనున్నామని చెప్పారు. కానీ ఇవేవి కార్యరూపం దాల్చలేదు. అన్ని చోట్ల ఉదాసీనతే కన్పిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement