విజయనగరం క్రైం: కురుపాం మండలానికి చెందిన ప్రేమికులను స్థానిక హెల్ప్‌డెస్క్ పోలీసులు క్షేమంగా ఇంటికి పంపించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండ లం గొటివాడ గ్రామానికి చెందిన యువతి (22), అదే మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన ఆరిక కార్తీక్(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ శనివారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.
ఇప్పుడే వస్తానని చెప్పి.. కార్తీక్ ఆమెను వదిలి పట్టణంలోకి వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కౌసల్య.. అతని సెల్‌కు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. సమీపంలోని పోలీసు హెల్ప్‌డెస్క్‌ను ఆశ్రయించింది. జరిగిన విషయమంతా హెచ్‌సీ కె.శ్రీనివాసరావుకు వివరించింది. కార్తీక్‌తో తనకు వివాహం జరిగినట్లు తెలిపింది.
అనంతరం హెచ్‌సీ శ్రీనివాసరావు కూడా కార్తీక్‌కు ఫోన్ చేశారు. ఆ నంబరుకూ తీయకపోవడంతో యువతికి నచ్చజెప్పి, రూ.200 నగదు ఇచ్చి ఆమెను కురుపాం మండలం వెళ్లే బస్సు ఎక్కించారు. సుమారు రెండు గంటల తర్వాత హెచ్‌సీ శ్రీనివాసరావు సెల్‌కు కార్తీక్ తిరిగి ఫోన్ చేశాడు. దీంతో అతనిని హెల్ప్‌డెస్క్‌కు తీసుకువచ్చి పోలీసులు వివరాలు సేకరించారు. కార్తీక్ వద్ద కూడా ఛార్జీలకు డబ్బులు లేకపోవడంతో హెచ్‌సీ శ్రీనివాసరావు మరో రూ.100 ఇచ్చి కురుపాం పంపించారు. కౌసల్య, కార్తీక్ కలిసి ఆదివారం ఒకేచోట నుంచి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారని హెచ్‌సీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
పోలీసుల చొరవతో ఒక్కటైన ప్రేమజంట
Published Sun, May 1 2016 11:29 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement