* బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదంటున్న డ్వాక్రా మహిళలు
* సంఘాల నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు
* తామేమీ చేయలేమంటున్న బ్యాంకర్లు
జమ్మలమడుగు: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లించాం.. ప్రతి నెలా పొదుపు కూడా కట్టేసుకుంటున్నాం.. తిరిగి తమకు రుణాలు ఇవ్వాలని అడిగితే బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.. రుణాలను కట్టని వారిని చూపిస్తూ వారితో కట్టిస్తేరుణాలు ఇస్తామంటున్నారని.. ఇదేమి న్యాయమని డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక మెప్మా కార్యాలయంలో మహిళ సంఘాల సర్వ సభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ తాతిరెడ్డి తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రుణాలు ఇవ్వక బ్యాంకుల చుట్టూ తమను తిప్పించుకుంటున్నారన్నారు. శ్రీనిధి నుంచి కూడా డబ్బులు తీసుకోనీయడం లేదన్నారు. రుణాలు ఏడాది దాటుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగైతే సంఘాలనుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. మెప్మా జిల్లా స్పెషలిస్ట్ రమణ మాట్లాడుతూ సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సక్రమంగా చెల్లించని వారిని సక్రమంగా చెల్లించేవారిని ఒకేవిధంగా చూడటం సరైంది కాదన్నారు.
మానవతాదృక్పధంతో ఆదుకోవాలి...
సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి మానవతాదృక్పధంతో తిరిగి రుణాలు ఇవ్వలని చైర్‌పర్సన్ తాతిరెడ్డితులసి కోరారు. సమావేశంలో శ్రీనిధి ఏరియా కోఆర్డినేటర్ శశిధర్‌రెడ్డి, మెప్మా పీఆర్పీ భవాని పాల్గొన్నారు.
తప్పు వారిది.. శిక్ష మాకా..!
Published Tue, Oct 21 2014 5:09 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement