చంద్రబాబు వల్ల డ్వాక్రా వ్యవస్థ చిన్నాభిన్నం
- కొత్త రుణాలు పుట్టక మహిళలకు తప్పని అవస్థలు
- ఐద్వా జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి
నర్సీపట్నం టౌన్: సక్రమంగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి విమర్శించారు. అధికారం కోసం ఎన్నికల ముందు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేయడమే అన్నారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 14వ మహాసభ నిర్వహించారు. ఐద్వా జెండాను జిల్లా అధ్యక్షురాలు కె.వి.సూర్యప్రభ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబీధ్ సెంటర్ వరకు మహిళలు ఐద్వా జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలను మేలు కొలుపుతూ గీతాలు ఆలపించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత కారణంగా తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక డ్వాక్రా మహిళలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హమీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. మహిళలపై పెరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన చర్య లు తీసుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశా రు. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. వంట కార్మికులు, ఆశా వర్క ర్లు, అవుట్‌సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడానికి చూస్తున్నారన్నారు.
బెల్టుషాపులు ఎత్తివేశామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రభావతి, గ్రేటర్ విశాఖ ప్రధాన కార్యదర్శి రమా, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.గౌరీ, జిల్లా నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు.