►బ్యాంకు అధికారుల తీరుకు నిరసనగా ప్రత్తిపాడులో రాస్తారోకో
►మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ప్రత్తిపాడు: రుణమాఫీ కోసం మహిళలు రోడ్డెక్కారు. ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాల మాఫీ అని హామీ ఇచ్చి, ఇపుడు కేవలం గ్రూపునకు రూ.లక్ష మాత్రమే అని ప్రకటించడం ఏంటని ఆగ్రహంతో రగిలిపోయారు. ఆంధ్రాబ్యాంకు అధికారుల మాటలతో మరింత ఆందోళనకు గురైన మహిళలు రాస్తారోకో చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
ప్రత్తిపాడు మండలం పిడపర్తి మల్లారెడ్డి ఫంక్షన్‌హాలులో గురువారం సాయంత్రం ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు అధికారులు సీబీఆర్‌ఎం(కమ్యూనిటీ బేస్‌డ్ రికవరీ మెకానిజమ్) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఏరియా కోఆర్డినేటర్ పి శివకుమార్, ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ దేవదాసు, ఫీల్డ్ ఆఫీసర్ చందన, మండల సమాఖ్య అధ్యక్షురాలు రత్నకుమారి, ఐకేపీ ఏపీఎం ఫణిబాబులతో పాటు వివిధ గ్రూపులకు చెందిన డ్వాక్రా లీడర్లు, గ్రామ సంఘాల అధ్యక్షులు వందల సంఖ్యలో హాజరయ్యారు.
►బ్యాంకు మేనేజర్ దేవదాసు మాట్లాడుతూ ప్రభుత్వ రుణ హామీ వల్ల మూడు, నాలుగు నెలలుగా బకాయిలు సక్రమంగా చెల్లించలేదని, అందువల్ల పొదుపు మొత్తాలను రుణ బకాయిలుగా జమ చేసుకున్నామని చెప్పారు. దీనిపై మహిళలు ఆగ్రహంవ్యక్తం చేశారు.
►ఓ గ్రూపు లీడర్ తాము రూ.లక్ష లోపు రుణం తీసుకున్నామనీ, రూ. 70వేలు చెల్లించేశామనీ, మిగిలిన సొమ్ము చెల్లించాలా అని ప్రశ్నించగా, అదీ చెల్లించాలనీ, మాఫీ వర్తిస్తే ఇచ్చేస్తామని మేనేజర్ స్పష్టం చేశారు. అలా కట్టకుంటే అదనపు వడ్డీ పడుతుందని చెప్పడంతో డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు.
►లక్షలోపు రుణాలు మాఫీ అంటుంటే ఇప్పుడు మీరు కచ్చితంగా కట్టాలనడమేంటని నిలదీశారు.
►స్పందించిన ఫీల్డ్ ఆఫీసర్ చందన అవన్నీ రాజకీయాలని, తీసుకున్న రుణాలను కట్టాల్సిందేననీ,మాఫీ గురించి మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదని తేల్చిచెప్పడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రెండున్నర గంటలపాటు రాస్తారోకో
►డ్వాక్రా మహిళలు ప్రత్తిపాడు- పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు బాపతు వెంకటరమణతో పాటు మండల సమాఖ్య అధ్యక్షురాలు రత్నకుమారి, గ్రామ సంఘం అసిస్టెంట్లు, పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికారు.
►ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ రాస్తారోకోను విరమించాలని కోరినప్పటికీ ఫలితం లేకుండాపొయింది.
►బ్యాంకు మేనేజర్ దేవదాసు వచ్చి రుణం కింద జమ చేసుకున్న పొదుపు సొమ్మును వెంటనే తిరిగి ఖాతాలోనికి జమచేస్తామని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చేవరకు ఒత్తిడి చేయబోమని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.
రుణంపై మహిళల రణం
Published Fri, Jul 25 2014 12:13 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement