హంగులన్నీ ఉంటేనే రాజధాని
- గన్నవరం ఎయిర్ పోర్టు తాత్కాలిక అభివృద్ధి
- పౌరపాలన మెరుగైతేనే నగరాభివృద్ధి
- అప్పులు మాఫీ అంటే అభివృద్ధి శూన్యమే
- స్మార్ట్ సిటీగా విజయవాడ
- కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, విజయవాడ : రాజధానిగా ఉండే నగరానికి అన్ని హంగులుండాలని, ముఖ్యంగా రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో పాటు ప్రజలు తాగేందుకు మంచినీరు, చక్కగా జీవించేందుకు విద్యా, వైద్య, ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యాలుండాలని కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం స్థానిక బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీస్ అనే అంశం పై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
స్మార్ట్ సిటీస్‌పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, నిర్ణయం తీసుకున్న తరువాత విజయవాడకు స్మార్ట్ సిటీ హోదా వస్తుందని హామీ ఇచ్చారు. అంతకంటే ముందు రాజధాని వైపు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు తరలి రావాలంటే కొన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు బాగుండాలని, ప్రస్తుతం గన్నవరం ఎయిర్ పోర్టును శరవేగంగా అభివృద్ధి చేసినా మూడేళ్లపైనే పడుతుందని అన్నారు.
అందువల్ల తాత్కాలికంగా అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావచ్చన్నారు. విజయవాడ చుట్టుపక్కల కొత్త రాజధాని ఎక్కడ వచ్చినా ప్రజలు విజయవాడలోనే నివశిస్తారని తెలిపారు. రాబోయే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని సూచించారు.
పౌరపాలన మెరుగైతేనే....
నగరాభివృద్ధి జరగాలంటే ప్రజల ఆలోచనా ధృక్పదంలో మార్పు రావాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పన్నులు వేసి పనులు చేస్తే ప్రజలు స్వాగతిస్తారని, పన్నులు వేయం..పనులు చేయం అంటే ఉపయోగం లేదని అన్నారు. నిధులు ఉంటేనే విధులు నిర్వహించగలుగుతారన్నారు.
ప్రజా సహకారంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. 12 ఏళ్లుగా నగరంలో పన్నులు పెంచలేదని, ఇప్పుడు రెండు మూడు నెలలుగా కార్పొరేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పులు మాఫీ అంటే అభివృద్ధి మాఫీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాభివృద్ధి జరగాలంటే రోడ్లు వెడల్పు చేయాలని, కాల్వలు శుభ్రం చేయాలని, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్, సీవరేజ్ వంటి సౌకర్యాలు మెరుగు పరచాలని మెట్రో రైలు తీసుకురావాలని...... ఇవ్వన్నీ జరగాలంటే పౌరసహకారం ఎంతైనా అవసరమని ఉద్ఘాటించారు.
నేతల తీరుపై జనం ఆవేదన...
వెంకయ్యనాయుడు ప్రసంగం పూర్తయిన తరువాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేదికపై నుంచి తమ సందేహాలు, సలహాలను తెలియజేశారు. విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ రాజధాని వస్తుందని ప్రకటించినా రాజకీయ నేతలు చేరి ఎకరాలకు ఎకరాల భూమి కొనుగోలు చేసి రేట్లు పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ గోకరాజు గంగరాజు, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీ కృష్ణ పాల్గొన్నారు.