డీసీసీబీ కుంభకోణం విచారణలో కీలక మలుపు | Key Turning Point Comes In DCCB Scam | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారుల్లో మొదలైన టెన్షన్‌ 

Published Sat, Jun 15 2019 11:37 AM | Last Updated on Sat, Jun 15 2019 11:37 AM

   Key Turning Point Comes In  DCCB Scam - Sakshi

సాక్షి, (పశ్చిమ గోదావరి) : ఇప్పటివరకూ సమన్వయంతో బ్యాంకు డబ్బులు స్వాహా చేసిన అధికారులు, డీసీసీబీ చైర్మన్‌ తాజాగా నిర్వహించిన ‘సమన్‌’వయ భేటీ చర్చనీయాంశమైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణకు అధికారులు శనివారం హాజరుకావాలంటూ ఉన్నతాధికారుల నుంచి సమన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హడావుడిగా సమావేశమైన డీసీసీబీ చైర్మన్‌ ముత్యాలరత్నం స్వాహాకు కథ, దర్శకత్వం తానే అయినా.. ఎలాగైనా బయటపడతానని.. మీ సంగతి మాత్రం చూసుకోవాలంటూ ఓ ఉచిత సలహా పడేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణంపై విచారణ సాగుతూనే ఉంది. ఫ్రిబవరిలో పాలకవర్గాన్ని రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడే విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే డీసీసీబీ చైర్మన్‌ గత ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విచారణ సాగకుండా చేశారు.

ఇప్పుడు తాజాగా ఈనెల 17న అధికారులందరూ విచారణకు హాజరుకావాలని విచారణ కమిటీ సభ్యులు డెప్యూటీ రిజిస్ట్రార్‌ ఎం.అబ్దుల్‌ లతీఫ్‌ డీసీసీబీ అధికారులకు సమన్లు జారీ చేయడంతో వారిలో టెన్షన్‌ మొదలైంది. దీంతో డీసీసీబీ చైర్మన్‌ ముత్యాల రత్నం అధికారులను తన ఇంటికి పిలిచి సమావేశం పెట్టారు. తాను ఎలాగొలా బయటకు వస్తానని, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే విచారణ ఆపుకునే యత్నాలు చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఈ నెల 27న జరగాల్సిన డీసీసీబీ బోర్డు సమావేశాన్ని 17వ తేదీకి మార్చారు. ప్రభుత్వం మారడంతో విచారణ ఆపుకునే అవకాశం లేదని, ఏం చేయాలోననే ఆందోళన అధికారుల్లోనూ, పాలకవర్గంలోనూ కనపడుతోంది.

అసలేం జరిగిందంటే..
ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు రూ.33.32 కోట్ల రుణం సెక్యూరిటీలు లేకుండా ఇచ్చి బ్యాంకు నష్టాలకు అధికారులు, ఉద్యోగులు కారణమయ్యారు. వీరిపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ విధానంలో ధాన్యం ఆడించి పౌర సరఫరాల శాఖకు బియ్యం ఇచ్చే మిల్లర్లు సరైన సెక్యూర్టీలు లేకుండా యలమంచిలి బ్యాంకు నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మిగిలిన బ్యాంకుల నుంచి మరో రూ.13 కోట్ల వరకూ అప్పులు పొందారు. యలమంచిలి బ్యాంకు ఇన్‌చార్జి మేనేజరు, మరి కొందరు ఉద్యోగులు మిల్లర్లు సరైన సెక్యూర్టీలు ఇవ్వకపోయినా రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేశారు. కస్టమ్‌ మిల్లింగ్‌ విధానంలో ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయాల్సిన మిల్లర్లు వాటిని బహిరంగ మార్కెట్‌లో అమ్మేసుకున్నారు. దీంతో గుట్టురట్టయింది. దీంతో మిల్లర్లపై చర్యలకు  పౌర సరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి, సెక్యూర్టీగా పెట్టిన ఆస్తులను జప్తుకు యత్నించింది. మిల్లర్లు స్పందించకపోవడంతో పౌరసరఫరాల శాఖ రుణం ఇచ్చిన డీసీసీబీపై చర్యలకు ఉపక్రమించింది. సెక్యూర్టీల్లేకుండా రూ. 20 కోట్లు రుణం ఎలా ఇచ్చారని, వారి తరఫున సెక్యూర్టీ ఇచ్చి న బ్యాంకు బాధ్యత వహించాలని నోటీసులు జారీ చేసింది.

విచారణకు షురూ..
దీంతో బ్యాంకు అధికారులు మిల్లర్ల నుంచి రుణం వసూలుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో బాధ్యులైన బ్యాంకు మేనేజరు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ రాష్ట్ర సహకార శాఖకు, ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ డెప్యూటీ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారిని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావిడిగా డీసీసీబీ బ్యాంకు ఏజీఎం ఒకరు యలమంచిలి వెళ్లి మిల్లర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రుణం ఎగ్గొట్టి ఐపీ..!
పాలకొల్లుకు చెందిన రైస్‌మిల్లర్‌ యలమంచిలి డీసీసీ బ్యాంకులో ఆస్తి తనఖా రిజిస్ట్రేషన్‌ చేయకుండా సుమారు రూ.11.90 కోట్లు రుణం పొందారు. దీన్ని ఎగ్గొట్టి ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు హడావిడిగా  పాలకొల్లు చాంబర్స్‌ కళాశాల సమీపంలోని పూలపల్లిలో ఎకరం రూ.2 కోట్లు విలువైన పంట పొలాన్ని హామీగా చూపి.. దాని విలువ రూ.8 కోట్లుగా చూపే యత్నం చేసినట్లు తెలిసింది. ఇరగవరం మండలానికి చెందిన ఇంకో రైతు రూ.6.90 కోట్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులే బ్యాంకు సొమ్మును చెల్లించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రెండురోజుల క్రితం ఏజీఎం ఒకరు యలమంచిలి పోలీసులకు అప్పటి బ్యాంకు మేనేజర్, సిబ్బంది, రుణం తీసుకున్న సుందర  రామిరెడ్డి అండ్‌ కోపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకు సిబ్బంది చేసిన యత్నాలు సఫలం కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో  అధికారులు టెన్షన్‌ పడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement