కేడీసీసీబీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి  | Madhavaram Ram Reddy Elected DCCB Kurnool Chairman | Sakshi
Sakshi News home page

కేడీసీసీబీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి 

Published Mon, Aug 5 2019 11:09 AM | Last Updated on Mon, Aug 5 2019 11:12 AM

Madhavaram Ram Reddy Elected DCCB Kurnool Chairman - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)లకు ప్రభుత్వం ఏడుగురు సభ్యుల నాన్‌ అఫీషియల్‌ కమిటీలను ఖరారు చేసింది. మంత్రాలయం మండలం మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) సభ్యుడిగా ఉన్న బీసీ నేత మాధవరం రామిరెడ్డిని కేడీసీసీబీ చైర్మన్‌గా, గోస్పాడు మండలం దీబగుంట్ల సొసైటీ త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌ అయిన పీపీ నాగిరెడ్డిని డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎంపిక చేసింది. వాస్తవానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఏడుగురు సభ్యుల కమిటీ సోమవారమే పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఒకట్రెండు రోజులు పట్టే అవకాశముంది. అంతవరకు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
 
వాల్మీకి నేత రామిరెడ్డి 
కేడీసీసీబీ చైర్మన్‌గా ఎంపికైన మాధవరం రామిరెడ్డి బీసీ సామాజిక వర్గ (వాల్మీకి) నేత.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి పదవుల్లోనే కాదు.. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారనే విషయం రామిరెడ్డి నియామకంతో స్పష్టమవుతోంది. రామిరెడ్డికి మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మంచి నేతగా గుర్తింపు ఉంది. మాధవరం గ్రామానికి చెందిన ఈయనకు ఊరిపేరే ఇంటిపేరుగా స్థిరపడింది. ఈయన గతంలో రెండు సార్లు మంత్రాలయం ఎంపీపీగా పనిచేశారు. 
నిజాయితీ కల్గిన నేత పీపీ నాగిరెడ్డి 
డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎంపికైన పీపీ నాగిరెడ్డికి నిజాయితీ కల్గిన నేతగా గుర్తింపు ఉంది.  ఈయన 2013 నుంచి డీసీఎంఎస్‌ చైర్మన్‌గా కొనసాగుతూ... మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షులుగానూ ఉన్నారు. గతంలో ఈయన నంద్యాల షుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్‌గానూ సమర్థవంతంగా పనిచేశారు.
  
డీసీసీబీ నాన్‌ అఫీషియల్‌ కమిటీ 
చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి ఎంపిక కాగా..సభ్యులుగా అహోబిలం లక్ష్మీనరసింహ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు నాసరి వెంకటేశ్వర్లు, నందవరం మండలం ముగితి గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి (ఈయన నందివరం సొసైటీలో సభ్యుడు), దేవనకొండ మండలం తెర్నేకల్‌ గ్రామానికి చెందిన దాసరి లుమాంబ (దేవనకొండ సొసైటీ సభ్యుడు), వెలుగోడు మండలం రేగడగూడూరు సొసైటీలో సభ్యురాలైన వెంకటేశ్వరమ్మ, సంజామల సొసైటీ త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌ అయిన గుండం సూర్యప్రకాశ్‌రెడ్డి, కల్లూరు మండలం ఉలిందకొండ సొసైటీ సభ్యుడైన కె.వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు.
 
డీసీఎంఎస్‌ కమిటీ 
చైర్మన్‌గా పీపీ నాగిరెడ్డి, సభ్యులుగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కే.వంశీధర్‌రెడ్డి, మహానంది మండలం గాజులపల్లికి చెందిన కె.రామకృష్ణ, డోన్‌ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన డి.వెంకటసుబ్బమ్మ, పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుబాన్‌బాష, మద్దూరుగ్రామానికి చెందిన వి.దేవభూషణం. డీసీఎంఎస్‌కు ఖరారు చేసిన కమిటీ ఈ నెల 15న బాధ్యతలు చేపట్టనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement