నకిలీ ఆభరణాలు ఇచ్చారని చూపుతున్న ప్రమోద్ కుమార్
సాక్షి, కర్నూల్: పట్ణంలోని డీసీసీబీ బ్రాంచ్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే నకిలీవి తిరిగి ఇచ్చారని ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ 2017లో 35.81 తులాల బంగారు ఆభరణాలు డీసీసీబీ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టి రూ.4,98,600 రుణం పొందాడు. 2019 డిసెంబర్‌లో రెన్యూవల్ చేసుకోగా.. రుణం, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,02,436 గురువారం మధ్యాహ్నం చెల్లించి బంగారు ఆభరణాలు విడిపించాడు.
కాగా గంట తర్వాత మళ్లీ బ్యాంక్‌కు చేరుకుని బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన నగలు నకిలీవని, తనకు బంగారు నగలు ఇవ్వాలని చెప్పాడు. అయితే బ్యాంక్‌లోనే సరిచూసుకుని అడిగితే తమకు సంబంధమని, బయటకు వెళ్లి వస్తే తమది బాధ్యత కాదని మేనేజర్ మహబూబ్ చెబుతున్నాడు. అంతా సరిగా ఉన్నట్లు బ్యాంక్ రికార్డులో ప్రమోద్ కుమార్ సంతకం చేశాడని, సాక్ష్యంగా సీసీ ఫుటేజ్‌లు కూడా ఉన్నట్లు మేనేజర్ చెబుతున్నాడు. ఈ విషయంపై బాధితుడు, బ్యాంక్ మేనేజర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇద్దరి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment