లేదే కనికరం.. రాదే పరిహారం! | Kurnool Farmers Worried For Compensation Of Lands | Sakshi
Sakshi News home page

లేదే కనికరం.. రాదే పరిహారం!

Published Fri, Aug 2 2019 8:30 AM | Last Updated on Fri, Aug 2 2019 8:30 AM

Kurnool Farmers Worried For Compensation Of Lands - Sakshi

నష్టపోయిన బొల్లవానిపల్లి రైతులు

సాక్షి,తుగ్గలి(కర్నూలు) : బంగారు నిక్షేపాల వెలికి తీతకు సంబంధించి భూములు విక్రయించిన రైతులకు అటు కంపెనీ డబ్బు ఇవ్వక, పరిహారం, బీమా రాక తీవ్రంగా నష్టపోయారు. మండలంలో బొల్లవానిపల్లి, జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల సరిహద్దుల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన జియోమైసూర్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ గత 20 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో పలు సర్వేలు చేసింది. చివరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని వెలికితీసేందుకు 2013లో ప్రభుత్వ అనుమతులు పొందింది. ఈ మేరకు 2018 ఏప్రిల్‌ 12న ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

ఎకరా రూ.12లక్షల ప్రకారం 350 ఎకరాలు కొనుగోలు చేసేలా కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంది. ఒకటి రెండు నెలల్లో భూములు కోల్పోయే రైతులకు కొన్న ప్రకారం మొదటి విడతగా రూ.10 లక్షలు, మలిదశలో రూ.2లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పంటలు కూడా వేయొద్దని, త్వరలో డబ్బు ఇచ్చి పనులు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందకుండా, పంటలు వేయకుండా తమ పొలాలు బీళ్లు పెట్టారు. అయితే కంపెనీ చెప్పిన గడువు ముగిసి నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదు. దీంతో బంగారు నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభం కాలేదు. చివరకు ఏడాది దాటిపోయి నా డబ్బు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కంపెనీ మాటలు నమ్మి మోసపోయామని అటు పంటలు వేసుకోక, ఇటు పంట రుణాలు పొందక చివరకు పంట నష్టపరిహారం, బీమా లాంటివి కోల్పోయామని బాధిత రైతులు వాపోతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరువుతో అల్లాడిపోతున్నామని, కుటుంబాలు గడవడం కూడా కష్టమైందని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తమకు డబ్బు ఇవ్వకపోగా, ప్రభుత్వం నుంచి వచ్చే పంటనష్ట పరిహారం, బీమా వంటి సౌకర్యాలు కోల్పోయామని వాపోతున్నారు.  పంటలు వేసుకోకుండా చేసిన కంపెనీనే తమకు జరిగిన నష్టాన్ని భరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలులో స్పందన కార్యక్రమంలో కూడా తమ కష్టాలు చెప్పుకున్నామని తెలిపారు.  

రైతులకు న్యాయం చేస్తాం 
బంగారు నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పాడ్డాయి. దీంతో అనుకున్న సమయంలో పనులు ప్రారంభించ లేక పోయాం. త్వరలోనే ఆటంకాలు తొలగిపోతాయి. పంటలు వేసు కోకుండా, పరిహారం, బీమా కోల్పోయిన రైతులు నష్టపోకుండా కంపెనీతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
– హనుమప్రసాద్, కంపెనీ ప్రతినిధి  

నెలకే డబ్బు ఇస్తామన్నారు 
బంగారు నిక్షేపాల వెలికితీత అని జియోమైసూర్‌ కంపెనీ ఏడాది క్రితం భూమలు కొంటామని చెప్పి ఎకరా రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నాది 6.20 ఎకరాలు కంపెనీకి పోతోంది. కంపెనీ వారు పంటలు వేసుకోవద్దు, డబ్బు ఇచ్చి పనులు మొదలు పెడతామని చెప్పారు. అయితే ఇంత వరకు డబ్బు ఇవ్వలేదు. దీంతో పంటలు వేసుకోక, పరిహారం బీమాకు నోచుకోక నష్టపోయిన తమను కంపెనీనే ఆదుకోవాలి. 
–లేపాక్షిరెడ్డి,రైతు, బొల్లవానిపల్లి 

పంటలు వేసుకోవద్దన్నారు 
బంగారు గనుల పనులు మొదలు పెడతామని పంటలు వేసుకోవద్దని కంపెనీ వారు చెప్పారు. ఏడాది దాటినా డబ్బు ఇవ్వలేదు. దీంతో తాము పంటలు వేసుకోక, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం, బీమా అన్నీ కోల్పోయాం. తమకు కలిగిన నష్టానికి కంపెనీనే బాధ్యత వహించాలి.  
– అంజినయ్య, రైతు, బొల్లవానిపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement