కౌలు రైతుల కష్టాలు | no bank loan to farmer they are in problems | Sakshi
Sakshi News home page

కౌలు రైతుల కష్టాలు

Published Mon, Jun 8 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

కౌలు రైతుల కష్టాలు

కౌలు రైతుల కష్టాలు

- రుణాలివ్వని బ్యాంకులు         
- బ్యాంకు నిబంధనలు పట్టించుకోని ప్రభుత్వం
- గత ఏడాది వంద మందికే రుణాలు    
- ఈ ఏడాది అవీ అందని పరిస్థితి

బ్యాంకు రుణాలు అందకపోవడంతో జిల్లాలో కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. కౌలు రైతులందరికీ రుణాలిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం మొండిచేయి చూపాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి.
 
సాక్షి, చిత్తూరు :  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన కౌలు రైతులు 5,626 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 5,626 మంది కౌలు రైతులను గుర్తించి ఏడాది కాలపరిమితితో రుణ అర్హత కార్డులను మంజూరు చేసింది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా అందరికీ రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో వంద మంది రైతులకు రూ.30 లక్షల లోపు రుణాలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులిపేసుకున్నాయి. మిగిలిన 5,526 మంది కౌలు రైతులకు మొండిచేయి చూపాయి. బ్యాంకుల చుట్టూ పదేపదే తిరిగి రైతులు విసిగిపోయారు. చేసేది లేక కౌలు రైతులు మిన్నకుండిపోయారు.

ఈ ఏడాదైనా రుణాలందేనా?
ప్రభుత్వం ఈ ఏడాదైనా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రుణాలు అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా కౌలు రైతులకు ఇచ్చే విషయంలో బ్యాంకులు నిబంధనలను బూచిగా చూపుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సూచనలు చేసినా పట్టించుకోవడంలేదన్నది బ్యాంకుల ఆరోపణ. ప్రధానంగా రుణ అర్హత కార్డుల కాలపరిమితిని ఏడాదికి బదులు మూడేళ్లకు పెంచాలి. కౌలు రైతులందరికీ రుణాలు అందించేందుకు వీలుగా రుణహామీ నిధిని (క్రెడిట్ గ్యారంటీ ఫండ్) ఏర్పాటు చేయాలి.

కౌలు రైతులకు మంజూరు చేసే పంట రుణాల నుంచి బ్యాంకులు కొంతమొత్తాన్ని ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వానికి జమచేస్తే ప్రభుత్వం అందుకు తగ్గ మ్యాచింగ్ గ్రాంట్‌ను రుణహామీ (క్రెడిట్ గ్యారంటీ) కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే ఈ నిధి వినియోగంపై విధివిధానాలను రూపొందిస్తామని బ్యాంకులు తెలిపాయి. దీంతో పాటు కౌలు రైతుల రుణాల వసూళ్లలో బ్యాంకులకు సహకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, స్వయం సహాయక బృందాలతో ప్రభుత్వం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో బ్యాంకులు కౌలు రైతులకు రుణాల మంజూరులో వెనుకడుగు వేశాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకుల సూచనలు పాటించి కౌలు రైతులకు రుణాలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement