బాబు వైఫల్యాలను నిలదీసేందుకే..: వైఎస్ జగన్ | Ys jagan mohan reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు వైఫల్యాలను నిలదీసేందుకే..: వైఎస్ జగన్

Published Wed, Dec 3 2014 1:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్, చిత్రంలో పార్టీ నేత విజయసాయిరెడ్డి - Sakshi

హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్, చిత్రంలో పార్టీ నేత విజయసాయిరెడ్డి

ఎన్నికలపుడు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫల మైన ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని..

* 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు: వైఎస్ జగన్
* 6 నెలలు తిరక్కముందే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
* రైతుల, డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న బాబు మాట తప్పారు
* ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారు
* బడ్జెట్లో చాలీచాలని కేటాయింపులు చేసి 20 శాతం రుణ మాఫీ అంటున్నారు
* దీనిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజలు ధర్నా చేస్తున్నారు
* రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే పూర్తి బాధ్యత
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

 
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలపుడు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫల మైన ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని.. అందువల్లనే ఈ నెల 5న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తమ పార్టీ ధర్నాలు చేయబోతోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజలు ఈ ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని నిలదీయబోతున్నారని.. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వారికి తాము అండగా నిలబ డతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సాధారణం గా ఏ ప్రభుత్వం పైనైనా ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే రెండేళ్లైనా పడుతుంది. అంతకన్నా ముందే ప్రజల్లోకి వెళ్లి ధర్నాలు, ఆందోళనలు అంటే వారు హర్షించరు. కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం పై ఆరు నెలలు తిరక్క ముందే తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ ప్రభుత్వం ఎపుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.
 
రైతులపై అపరాధ వడ్డీ భారం పడింది...
‘‘మొన్న ఒంగోలు పార్టీ కార్యకర్తల సమావేశంలో నేను చెప్పింది ఇదే. ఒక ప్రతిపక్షంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా ఉండి వారి తరఫున పోరాడాలని కోరాను’’ అని జగన్ తెలిపారు. రైతుల, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆయన తప్పుపట్టారు. బ్యాంకుల రుణాలు కట్టొద్దని చంద్రబాబు ఎన్నికలపుడు చెప్పిన మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.  రైతుల నుంచి ఇపుడు అపరాధ వడ్డీ కింద 14శాతాన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
 
రుణాలపై వడ్డీయే రూ. 28 వేల కోట్లు...
 ‘‘87 వేల కోట్ల రూపాయల రైతు రుణాల మీద ఏడాదికే రూ. 12,800 కోట్ల అపరాధ వడ్డీ అవుతుంది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్‌లో రుణ మాఫీకి చేసిన కేటాయింపులు వడ్డీలకు కూడా సరిపోవు’’ అని జగన్ గుర్తుచేశారు. ‘‘బడ్జెట్‌లో తగినన్ని కేటాయింపులు చేయకపోవడంతో.. మార్చి నెలాఖరు లోపు అపరాధ వడ్డీయే కాకుం డా మరో రూ. 12,800 కోట్ల వడ్డీ భారం అదనంగా పడుతుంది. ఆ ప్రకారం మొత్తం మీద 25 వేల కోట్ల రూపాయల మేరకు వడ్డీ అవుతుంది. ఇదే చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టని కారణంగా అపరాధ వడ్డీ రూపేణా రూ.14 వేల కోట్లు, రూ. 14 వేల కోట్లు అదనపు వడ్డీ భారం కలిపితే.. అసలు కథ దేవుడెరుగు.. వడ్డీయే రూ. 28 వేల కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబనే ఈ పెద్ద మనిషి బడ్జెట్‌లో చాలీచాలని కేటాయిం పులు చేసి దాన్నే 20 శాతం రుణ మాఫీ కింద జమ చేసినట్లుగా బుకాయిస్తున్నారు. ఇది ప్రజ లను మోసం చేయడం తప్ప మరొకటి కాదు’’ అని చంద్రబాబును తూర్పారబట్టారు. ‘‘ఇలా చేయడం ఎంత వరకు ధర్మమని జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రజలు గట్టిగా నిలదీయబోతున్నారు. వారికి మేము అండగా ఉంటున్నాం’’ అన్నారు.
 
పింఛన్ల కోతకు బడ్జెట్‌లోనే నిర్ణయం...
 ‘‘బాబు పింఛన్ల విషయంలోనూ ఇలాగే చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి 43,11,686 పిం ఛన్లు ఉన్నాయి. ఒక్కో పింఛనుదారుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించడానికి అందరికీ నెలకు రూ. 431 కోట్లు అవసరమవుతాయి. ఏడు నెలల పాటు చెల్లించడానికి సుమారు రూ. 3,000 కోట్లు అవసరమవుతాయి. ఇవే పింఛన్లకు రూ. 200 చొప్పున చెల్లించడానికి నెలకు రూ. 130కోట్లు అవసరమవుతాయి. ఐదు నెలల పాటు రూ. 130 కోట్ల చొప్పున చెల్లించడానికి రూ. 750 కోట్లు కావాలి. ఇదివరకు పింఛను, పెరిగిన పింఛను మొత్తం చెల్లించడానికి పన్నెం డు నెలలకు గాను రూ. 3,700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో కేటాయించింది రూ. 1,338 కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్ కేటాయింపుల రోజునే పింఛన్లను అడ్డగోలుగా కత్తిరించాలని చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు’’ అని జగన్ ఎండగట్టారు. ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను బాధితుల పరిహారం కోసం కూడా తుపాను ప్రభావిత జిల్లాల్లో ధర్నాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.  
 
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికి 86 మం ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పత్రికల్లో చదివాం. పంటలకు పంటల బీమా పథకం అందక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే’’ అని ఆయన ధ్వజమెత్తారు.
 
 తెలంగాణలోనూ రైతు సమస్యలపై పోరాడుతామని, తమ పార్టీ ఎంపీ పి.శ్రీనివాసరెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాక రైతు సమస్యలపై చురుగ్గా పని చేస్తున్నారని, రైతులను ఆదుకోవాలని గవర్నర్‌ను తొలుత వినతిపత్రం సమర్పించిన పార్టీ తమదేనని జగన్ చెప్పారు. రైతులకు న్యాయం జరిగేదాకా తమ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement