మరిన్ని రంగాలకు ప్రాధాన్య హోదా
- చిన్న రైతులకు 8 శాతం నిధులు
- సిబ్బందికి తప్పనిసరి సెలవు నిబంధన
- రిజర్వ్ బ్యాంక్ వెల్లడి
ముంబై: బ్యాంకులు రుణాలివ్వడానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాల నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ గురువారం సవరించింది. మధ్యతరహా సంస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక విద్యుత్ మొదలైన రంగాలను కూడా ప్రాధాన్యతా రంగ పరిధిలోకి చేర్చింది.ఇకపై మొత్తం రుణాల్లో 8 శాతం నిధులను చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వాలని పేర్కొంది.
దశలవారీగా 2017 మార్చి నాటికి దీన్ని అమలు చేయాలని సూచించింది. ఇక 20 కన్నా తక్కువ శాఖలు ఉన్న విదేశీ బ్యాంకులు కూడా 2019-20 నాటికి ఇతర బ్యాంకులకు సరిసమానంగా 40 శాతం రుణాలు ప్రాధాన్యతా రంగాలకి ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం వ్యవసాయం, సూక్ష్మ.మధ్యతరహా సంస్థలు, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్, విద్య, హౌసింగ్ మొదలైన వాటిని ప్రాధాన్యతా రంగాలుగా పరిగణించి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి.
మరోవైపు బ్యాంకులు విధిగా తమ ఉద్యోగులకు ‘తప్పనిసరి సెలవుల’ నిబంధనను పాటించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ట్రెజరీ తదితర కొన్ని ముఖ్యమైన విభాగాల ఉద్యోగులు ఏడాదిలో ఒకసారి ఏకమొత్తంగా పది రోజుల సెలవును తప్పనిసరిగా వినియోగించుకునేట్లు చూడాలని సూచించింది. మోసాలు వంటి రిస్కులు తలెత్తకుండా ఇటువంటి విధానాలు పటిష్టంగా అమలు చేయడం ముఖ్యమని ఆర్‌బీఐ పేర్కొంది.
ట్రాన్స్‌జెండర్లు సైతం బ్యాంకు సేవలను సులభతరంగా పొందే దిశగా.. అన్ని ఫారమ్‌లు, అప్లికేషన్లలో వారి కోసం ప్రత్యేకంగా మరో కాలమ్ ఏర్పాటు చేయాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. స్త్రీ, పురుషులకు తప్ప తమకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం వల్ల ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.