ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టిన సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించేలా బ్యాంకులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది రిజర్వ్ బ్యాంక్. ఒకవేళ రుణ పునర్‌వ్యవస్థీకరణ చేసినప్పటికీ నిర్దిష్ట కాలంలో సదరు కంపెనీ గట్టెక్కని పక్షంలో దానికి ఇచ్చిన అప్పును ఈక్విటీ కింద మార్చుకునేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. తద్వారా రుణ భారం గల కంపెనీలను బ్యాంకులు తమ అజమాయిషీలోకి తెచ్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.
బ్యాంకులు రుణ పునర్‌వ్యవస్థీకరణ చేసినా కూడా నిర్వహణపరమైన అసమర్థత వల్ల పలు కంపెనీలు నిలదొక్కుకోవడం లేదన్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యాన్ని మారుస్తూ వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణకు (ఎస్‌డీఆర్) ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపింది. సదరు సంస్థకు రుణమిచ్చిన బ్యాంకుల ఫోరం (జేఎల్‌ఎఫ్) దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.
ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడే .. నిర్దిష్ట లక్ష్యాలను సాధించని పక్షంలో బాకీ మొత్తాన్ని కంపెనీలో వాటాల కింద మార్చుకునేలా నిబంధనను బ్యాం కులు పొందుపర్చాలని ఆర్‌బీఐ తెలిపింది. దీనికి సదరు కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఇలాంటి ఎస్‌డీఆర్‌కు అనుమతులు లేకపోతే రుణ పునర్‌వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఉండబోదని పేర్కొంది.