
బ్యాంకు రుణంతో కారు తీసుకొని ఉడాయించిన సూర్యతేజ్
హైక్లాస్ గెటప్.. ఖరీదైన నివాసం.. డాబుసరి మాటలు.. ఇవే పెట్టుబడిగా ఓ మాజీ ఐఏఎస్ కుమారుడు వరుస మోసాలకు పాల్పడుతున్న వైనం బట్టబయలైంది.
ఇతడికి కర్నెందుల విజయ్‌కుమార్ చాణక్య, జయకుమార్, సూర్యతేజ్ తదితర మారుపేర్లూ ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నం.25లోని టర్నోహౌస్ అనే ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్‌లో సూర్య కమర్షియల్ పేరుతో సూట్‌కేస్ కంపెనీ ఏర్పాటు చేశాడు. కారు కొనుగోలుకు రూ.70 లక్షల రుణం కావాలంటూ జూబ్లీహిల్స్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో దరఖాస్తు చేశాడు. ముషీరాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న హైక్లాస్ ఇంటిని బ్యాంకు అధికారులకు చూపించాడు. ఫిబ్రవరి 6న రూ.70.2 లక్షల రుణం మంజూరైంది. జూబ్లీహిల్స్‌లోని ప్రైడ్ మోటార్స్ షోరూం నుంచి రూ.79.17 లక్షలకు ల్యాండ్‌రోవర్ కారు ఖరీదు చేశాడు.
నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ నిందితుడి చిరుమానాను ఆరా తీశారు. ఆచూకీ దొరక్కపోవడంతో బ్యాంకు చీఫ్ రీజినల్ మేనేజర్ శివకుమార్ చతుర్వేది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేయగా ఇప్పటివరకు మొత్తం 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అన్నీ ఈ తరహా మోసాలేనని వెల్లడైంది. గతంలో ఇలా ఖరీదు చేసిన కార్లను నెల వ్యవధిలోనే విక్రయించేవాడని తేలింది. ఓ సందర్భంలో బ్యాంకు రుణం మంజూ రు కావడం ఆలస్యమవుతుండటంతో కేంద్రమంత్రి పేరుతో బ్యాంక్ అధికారికి ఫోన్ కూడా చేశాడు. వరుస మోసాలకు పాల్పడుతున్న ఈ ఘరానా మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.