మాల్యాను భారత్ కు పంపించం: యూకే
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో భారత్ కు యూకే షాక్ ఇచ్చింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవల యూకే ప్రభుత్వాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కోరింది. అయితే యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని అధికారులు స్పష్టంచేశారు. అయితే ఈ కేసు నిమిత్తం అవసరమైతే ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధమని యూకే అధికారులు వివరించడం భారత్ కు కాస్త ఊరటనిచ్చే అంశమ. ఎలాంటి సమాచారం అందించకుండా గత మార్చి 2న విజయ్ మాల్యా లండన్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అతడిపై చర్యలు తీసుకోవాలని తమ డబ్బులు రికవరీ చేసేలా చూడాలని బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యాను భారత్ కు తిరిగి పంపించాలని యూకే ప్రభుత్వాన్ని భారత్ ఏప్రిల్ 29న కోరింది. అదేవిధంగా గత నెలలో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దయింది. మాల్యా విషయంలో చర్యలు తీసుకుని భారత్ కు తిప్పిపంపడం అసాధ్యమని, సాయం చేస్తామని యూకే అధికారులు వివరించారు.