మాల్యాకు బిగుసుకుంటున్న ఉచ్చు!
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బిగుసుకున్న ఉచ్చు మరింత బలపడేలా కనిపిస్తోంది. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది.
ఇదిలా ఉంటే బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్నారు. విచారణకు రావాలంటూ ఈడీ మూడు సార్లు నోటీసులు పంపినా... డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తీసుకువచ్చేదిశగా బ్రిటన్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. గత మార్చి 2వ తేదీన విజయ్ మాల్యా లండన్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
మాల్యా భారత్ కు తిరిగిరాకపోవడం, ఆయనపై దాఖలయిన పిటిషన్లు, కేసులపై విచారణ నిమిత్తం స్వదేశానికి తిరిగి రావాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఇచ్చిన గడువులోగా వెల్లడించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యాంకులకు రూ.9,400 కోట్ల రుణాల ఎగవేతను క్షుణ్ణంగా పరిశీలించిన 10మంది సభ్యుల కమిటీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయడానికి అంగీకరించారు.