న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు మరోమారు చుక్కెదురైంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరస్థుడుగా ప్రకటించిన మాల్యా పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది.
తనను పరారీలో ఉన్నఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నాన్ ప్రాసిక్యూషన్ కారణంగా పిటిషన్ కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 9 వేల కోట్లకు పైగా ఎగవేసిన మాల్యా 2016లో లండన్‌కు చెక్కేశాడు. దీనిపై సీబీఐ , ఈడీ సులు నమోదు చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 5, 2019న ముంబై ప్రత్యేక న్యాయస్థానం చట్టం ప్రకారం మాల్యాను ‘పరారీదారు’గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి వేగంగా రప్పించడం, ఆస్తుల రికవరీనిపై ద్వైపాక్షిక సమన్వయం కాకుండా బహుపాక్షిక చర్యలపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. అటు గురుగ్రామ్‌లో జరిగిన జీ20 దేశాల అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు తమ అవినీతి సొమ్మును డబ్బును టెర్రర్ ఫండింగ్ , యువతను నాశనం చేస్తున్న అక్రమ మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల అమ్మకం లాంటి అనేక విధ్వంసక సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయ్ మాల్యాతో సహా పీఎన్‌బీ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు దేశం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment