మాల్యాతో చర్చించండి.. నష్టాలను తగ్గించుకోండి..
బ్యాంకులకు అసోచామ్ సూచన
న్యూఢిల్లీ: భారీ ఎత్తున బ్యాంకు రుణాలు కలిగివున్న విజయ్ మాల్యాతో చర్చలు జరిపి రావాల్సిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ బ్యాంకులకు సూచించింది. చర్చలతో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపింది. మాల్యా బ్యాంకులకు ఇచ్చిన రూ.4,000 కోట్ల ఆఫర్ తన రుణ చెల్లింపు ఉద్దేశాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. మాల్యా రుణ ఎగవేత చర్యపై బ్యాంకులు.. మీడియా నివేదికలకు, బహిరంగ చర్చలకు ప్రభావితం కావొద్దని తెలిపింది.
మాల్యా ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా బ్యాంకులు ఆయనతో వాస్తవిక చర్చలు జరిపితే రూ.4,000 కోట్ల సంఖ్య మారొచ్చని పేర్కొంది. ‘ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ముందున్న ప్రధాన అంశం వాటి ఆస్తులను/డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవడం. లేకపోతే అవి మొండిబకాయిలుగా మారిపోతాయి. అందుకే డబ్బుల రికవరీకి గట్టి ప్రయత్నం జరగాలి’ అని పేర్కొంది.