నన్ను అరెస్ట్ చేస్తే.. ఒక్క రూపాయీ రాదు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశంవిడిచి పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం తాను ఇంగ్లండ్ను వదిలివచ్చే ఉద్దేశ్యంలేదని చెబుతున్నాడు. తన పాస్పోర్టు తీసుకున్నా, అరెస్ట్ చేసినా బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా రాదని చెప్పాడు. బ్యాంకులకు ఎంతో కొంత చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విజయ్ మల్యా పలు బ్యాంకులకు దాదాపు 9500 కోట్ల రూపాయలు బకాయిపడిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆయన ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు.
లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పాస్ట్ పోర్టును కూడా రద్దు చేసింది. ఇక మాల్యా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.