భారత్కు రావాలని ఉంది : మాల్యా
భారత్కు రావాలని ఉంది : మాల్యా
Published Fri, Sep 9 2016 1:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా త్వరలోనే భారత్కు తిరుగుముఖం పట్టనున్నారట. తనకు భారత్కు రావాలని ఉందని పేర్కొంటూ.. పాస్పోర్టు రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. తన పాస్పోర్టును ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో తాను భారత్కు రాలేకపోతున్నానని విజయ్ మాల్యా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఓ అప్లికేషన్ ఫారంను మాల్యా ఢిల్లీ పాటియాల కోర్టు ముందు ఉంచినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో మాల్యా పాస్ పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. 2000 ఫెరా ఉల్లంఘన కేసును కూడా ఉపసంహరించుకోవాలని మాల్యా అభ్యర్థిస్తున్నారు. రద్దైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్(కేఏఎల్) ప్రమోటర్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా గతవారమే ముంబాయిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. అదేవిధంగా దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ అగర్వాల్పై కూడా సర్వీసు టాక్స్ కేసు దాఖలు చేసింది. ఈ లిక్కర్ కింగ్కు సంబంధించిన రూ.6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన అన్ని రకాల ఆస్తులు ఫామ్హోజ్, ఫ్లాట్స్ను ఈడీ జప్తుచేసింది.
వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.9400 కోట్ల రుణాల చెల్లింపుల విషయంలో మాల్యా విఫలమవడంతో ఇప్పటికే రూ.1,141 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ, తాజాగా జప్తుతో మాల్యా ఆస్తుల విలువ రూ.8,044 కోట్లకు చేరుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) ప్రకారంగా అలీబాగ్ వద్ద ఉన్న రూ.25 కోట్ల విలువైన భవంతితోపాటు బెంగళూరులో రూ.565 కోట్ల విలువైన కింగ్‌ఫిషర్ టవర్, రూ.800 కోట్ల విలువైన మాల్, అపార్ట్‌మెంట్లు, పలుబ్యాంకుల్లో ఉన్న రూ.10 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, యూఎస్‌ఎల్, యునైటెడ్ బ్రెవరేజ్ లిమిటెడ్, మెక్‌డోనాల్డ్ హోల్డింగ్ కంపెనీ, యూబీహెచ్‌ఎల్‌లో ఉన్న వాటాలను ఈడీ అటాచ్ చేసింది. వీటి నికర విలువ రూ.3,635 కోట్లు. 2010లో విలువ ఆధారంగా సంస్థకు చెందిన రూ.4,234.84 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు అయింది. ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ రూ.6,630 కోట్ల స్థాయిలో ఉంటుంది.
Advertisement
Advertisement