సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై దివాలా ముద్ర క్రమంగా సమసిపోతోంది. ఇటీవలి వరకు అప్పు పుట్టడమే గగనంగా ఉన్న తరుణంలో ఓ జాతీయ బ్యాంకు ఆర్టీసీకి రూ.300 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అది కూడా ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే. కొన్నేళ్లుగా ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా కూడా అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు తటపటాయించిన తరుణంలో ఇప్పుడు ఏ పూచీకత్తుతో సంబంధం లేకుండా ఆర్టీసీ ఆస్తులపై తనఖా రుణం ఇచ్చేందుకు అంగీకరించడం విశేషం.
చదవండి: రైతులు భిక్షగాళ్లు కాదు..పరిహార వారి హక్కు: హైకోర్టు
నగరంలో పక్కపక్కనే ఉన్న జంట డిపోల అధీనంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని తనఖా పెట్టుకుని ఈ రుణం ఇవ్వనుంది. కొద్దిరోజులుగా ఆర్టీసీ కార్యకలాపాలు చురుగ్గా సాగటం, కొత్తగా వచ్చిన ఎండీ సజ్జనార్ ఆర్టీసీ దిశ మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతుండటం, రోజువారీ ఆదాయం పెరుగుతూ ఉండటంతో బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఓ బ్యాంక్ రూ.300 కోట్ల రుణం ఇచ్చేందుకు రెండుమూడు రోజుల్లో అధికారిక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈమేరకు అధికారిక లేఖను కూడా అందించినట్టు తెలిసింది. ప్రతిపనికీ ప్రభుత్వంపై ఆధారపడే దుస్థితి నుంచి సంస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా సొంతంగా వనరులు సమకూర్చుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను ఆర్టీసీ అమల్లోకి తెస్తున్నట్టు కనిపిస్తోంది.
చదవండి: డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా.. బస్సు చార్జీల సవరణ!
పూచీకత్తు రుణం కొలిక్కి రాకపోవటంతో..
మూడు నెలల క్రితం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల రుణం కోసం ఆర్టీసీకి పూచీకత్తు ఇచ్చింది. ఆ జాతీయ బ్యాంకుతో చర్చలు జరగ్గా, స్థానిక అధికారులు సరేనన్నా, ఆ బ్యాంకు కేంద్రస్థాయి అధికారులు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున తిరస్కరించారు. చివరకు అందులో సగం నిధులు విడుదల చేశారు. దీంతో మిగతా ఐదొందల కోట్ల కోసం మరికొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగితే తప్ప రాలేదు. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా మరో రూ.500 కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది.
ఆ మొత్తాన్ని కేవలం ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు తీర్చేందుకే వినియోగించాలని నిర్ణయించిన ఆర్టీసీ.. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో చర్చించింది. ఆ సంస్థ అందుకు అంగీకరించినా.. ఇప్పటివరకు పూచీకత్తు లేఖ ఆ సంస్థకు అందలేదు. దీంతో ఆ రుణం రాలేదు. ఇప్పుడు దాని బదులు స్వయంగా ఆర్టీసీనే ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రుణం పొందనుంది.
సహకార పరపతి సంఘానికే..
ఆర్టీసీ ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం మొత్తాన్ని తమ జీతాల నుంచి జమ చేస్తూ ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి ఈ 300 కోట్ల నిధులు కేటాయించనున్నారు. సీసీఎస్ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడుకోవడంతో అందులో నిధులు కరిగిపోయాయి. దాదాపు రూ.వెయ్యి కోట్లను ఆర్టీసీ వాడేసుకోవడంతో ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు పొందే వీల్లేకుండా పోయింది. క్రమంగా సీసీఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడం ద్వారా, ఇంతకాలం అందులో జమచేసుకున్న మొత్తాన్ని తీసుకోవాలని పోటీపడుతుండంతో సీసీఎస్ మూతపడే పరిస్థితి ఏర్పడింది.
ఈనేపథ్యంలో దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కొన్ని బకాయిలు తీర్చాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. దీంతో ఏడాది కాలంగా పెండింగులో ఉన్న రుణ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసే అవకాశం ఉంది. సీసీఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకు దరఖాస్తులు సమర్పించినవారు ఇప్పుడు ఉపసంహరించుకునేందుకు ముందుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment