సాక్షి, సిటీబ్యూరో : ఆర్థిక సంవత్సరం ముగింపు సమయమైన మార్చ్ ఎండింగ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా బిజీగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే రుణ దరఖాస్తులను అన్ని కోణాల్లోనూ పరిశీలించకుండా ఏజెంట్లను నమ్ముతాయి. దీనిని అనుకూలంగా మార్చుకుందో త్రయం. ఇద్దరు బ్యాంకు ఏజెంట్లతో ముఠా కట్టిన సూత్రధారి ఆరు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేయడం ద్వారా కేవలం 20 రోజుల్లో రూ.77 లక్షలు రుణం తీసుకుని ఎగ్గొట్టాడు. గతేడాది చోటు చేసుకున్న ఈ స్కామ్‌పై రెండు ఆర్థిక సంస్థలు ఇటీవల పంజగుట్ట, బేగంపేట ఠాణాల్లో ఫిర్యాదులు చేశాయి. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.66 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు.
జీతం సరిపోకపోవడంతో...
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ ఐటీఐ పూర్తి చేసి 2001లో సిటీకి వలసవచ్చాడు. గచ్చిబౌలిలోని విప్రో సంస్థలో కమ్యూనికేషన్స్ విభాగంలో నెలకు రూ.30 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఈ జీతంతో జల్సాలు, కుటుంబ పోషణ సాధ్యం కాకపోవడంతో అప్పులు పెరిగాయి. వీటి నుంచి బయపడే మార్గాలు అన్వేషిస్తున్న ఇతడికి కూకట్‌పల్లికి చెందిన వేణుగోపాల్‌లో పరిచయం ఏర్పడింది. నకిలీ పత్రాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడం ఎలాగో నేర్పిన ఇతగాడు అందుకు అవసరమైన బోగస్ పాన్‌కార్డులు, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువీకరణలు సైతం తయారు చేసి ఇచ్చాడు.
వీటి ఆధారంగా రుణాలు తీసుకోవడానికి మార్చ్ ఎండింగ్ సరైన సమయమంటూ సూచించాడు. అయితే బోగస్ పత్రాల ఆధారంగా రుణం పొందాలంటే బ్యాంకు ఏజెంట్ల సహకారం ఉండాలని భావించిన శ్రీనివాస్ సోమాజిగూడ, మియాపూర్‌లకు చెందిన మల్లికార్జునరావు, నాగిరెడ్డిలను తనతో కలుపుకున్నాడు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకునే రుణంలో సగం వీరు, మిగిలిన సగం శ్రీనివాస్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
ఐదు సంస్థలు..రూ.77 లక్షలు...
విప్రోలో పని చేస్తున్న శ్రీనివాస్ అక్కడ ధ్వంసం చేయాల్సిన డేటా నుంచి కొన్ని ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించాడు. వీటి ఆధారంగా వేణుగోపాల్ సాయంతో బోగస్ పత్రాలు, «ధ్రువీకరణలు తయారు చేయించాడు. శ్రీనివాస్ జీతం రూ.30 వేలు కాగా, దీనిని రూ.1.26 లక్షలకు పెంచుతూ నకిలీ పే స్లిప్స్ రూపొందించారు. వీటిని దాఖలు చేస్తూ ఈ ముఠా గతేడాది మార్చ్‌లో మొత్తం ఆరు సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసింది. ఏజెంట్లు మల్లికార్జున్, నాగిరెడ్డి ఫీల్డ్ వెరిఫికేషన్ స్టాఫ్‌ను, రుణ మంజూరు అధికారులను ఏమార్చడంతో రుణాలు మంజూరయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు, సిటీ బ్యాంక్ నుంచి రూ.12 లక్షలు, ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.12.5 లక్షలు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు, క్యాపిటల్ ఫస్ట్ సంస్థ నుంచి రూ.15 లక్షలు, టాటా క్యాపిటల్ సంస్థ నుంచి రూ.12.5 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తంలో సగం మల్లికార్జున్, నాగిరెడ్డి తీసుకోగా మిగిలింది శ్రీనివాస్ పట్టుకుని తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అప్పులు తీర్చడంతో పాటు జల్సాలకు ఖర్చు చేశాడు.
ఏడాది ఆలస్యంగా ఫిర్యాదులు...
ఈ వ్యక్తిగత రుణాలకు సంబంధించి శ్రీనివాస్ ప్రతి నెల వాయిదాలు చెల్లించకపోవడంతో క్యాపిటల్ ఫస్ట్, సిటీ బ్యాంక్ సంస్థలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో తమకు దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తుల్లో ఉన్న ఫొటో శ్రీనివాస్‌ది కాదని తేలింది. వేరే వారి ఫొటో అతడి వివరాలతో వీటిని రూపొందించారని, విప్రోలోనూ ఉద్యోగం మానేసినట్లు బయటపడింది. కూకట్‌పల్లిలో అతడు ఇచ్చిన చిరునామా సైతం బోగస్‌గా గుర్తించారు. అయినప్పటికీ దాదాపు ఏడాదికి పైగా ఆల స్యం చేసిన ఈ రెండు సంస్థలూ ఇటీవల పం జగు ట్ట, బేగంపేట ఠాణాలో ఫిర్యాదు చేశాయి.
నార్త్‌జో న్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్, కేఎస్ రవి రంగంలోకి దిగారు. అనేక ప్రాంతాల్లో గాలించి గురువారం శ్రీనివాస్, మల్లికార్జున్, నాగిరెడ్డిలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.8.66 లక్షల నగదు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కు సంబంధించిన మరో నిందితుడు వేణుగోపాల్ ఆచూకీ లభించట్లేదు. శ్రీనివాస్ నుంచి తీసుకోవాల్సిన కమీషన్ సైతం అతడు తీసుకోలే దు. అతడు చనిపోయాడంటూ శ్రీనివాస్ చెబుతుండటంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
దొంగలకు రోజుల్లో రుణాలు
బోగస్ పత్రాలు, నకిలీ ధ్రువీకరణలతో దరఖాస్తు చేస్తున్న దొంగలకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కేవలం రోజుల్లో రుణాలు ఇచ్చేస్తున్నాయి. సాధారణ వ్యక్తులు పక్కాగా అప్‌లై చేసుకున్నా వారాలు, నెలలు తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించాలి. తమ వైఖరి మార్చుకుంటూ సంస్థాగతంగా ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. ఏదైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేయాలి. ఈ కేసులో బ్యాంకు సిబ్బంది, అధికారుల పాత్ర ఉందా? అనే కోణ ంలో ఆరా తీస్తున్నాం. ఫీల్డ్ వెరిఫికేషన్ సిబ్బ ంది వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆధారాలు లభిస్తే వారినీ అరెస్టుచేస్తాం.
– పి.రాధాకిషన్‌రావు, డీసీపీ, టాస్క్‌ఫోర్స్
Comments
Please login to add a commentAdd a comment