జోరుగా నకిలీ సర్టిఫికెట్లు దందా
సాక్షి, సిటీబ్యూరో: ముగ్గురు సూత్రధారులు... ఇద్దరు ఏజెంట్లు... మరో ఇరువురు సహాయకులు... ఇలా ఏడుగురు వేర్వేరు ముఠాలు ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల దందా ప్రారంభించారు. ఎస్సెస్సీ నుంచి ఇంజినీరింగ్ వరకు వివిధ విద్యార్హత పత్రాలను తయారు చేసి అమ్మేస్తున్నారు. వీరి గుట్టును రట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చి కర్మన్‌ఘాట్ ప్రాంతంలో స్థిరపడిన వి.దినకర్‌రెడ్డి అలియాస్ దినేష్ రెడ్డి అలియాస్ దిన్ను రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో తృప్తిపడని ఇతగాడు నకిలీ సర్టిఫికెట్ల దందా సైతం ప్రారంభించాడు.
వరంగల్ జిల్లా నుంచి వచ్చిన కొత్తపేటలోని మోహన్‌నగర్‌లో స్థిరపడిన మార్కెటింగ్ ఉద్యోగి సి.సునీల్‌రెడ్డిని ఏజెంట్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. మరోపక్క దిల్‌సుఖ్‌నగర్‌లో గాయత్రి ఎడ్యుకేషనల్ అకాడెమీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఎ.రామారావు సైతం ఇదే దందా ప్రారంభించి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి నాగోల్‌లో స్థిరపడిన బి.మనోజ్‌ను ఏజెంట్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన జియాఉల్ హసన్ సైతం నకిలీ విద్యార్హత పత్రాలు తయారు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. దినకర్, రామారావులు తమ ఏజెంట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్లు అవసరమైన వారిని గుర్తించే వారు. కొన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేయడం ద్వారా కంప్యూటర్‌లో సా‹ఫ్ట్‌కాపీల రూపంలో భద్రపరిచే వాడు.
ఏజెంట్లు తీసుకువచ్చిన వివరాలను ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ ద్వారా సాఫ్ట్‌కాపీల్లో పొందుపరిచి ప్రింట్స్ తీసేవారు. వీటిపై ఉంచాల్సిన హెలోగ్రామ్స్‌తో పాటు స్టాంపుల్ని స్థానికంగానే తయారు చేయించే వారు. దినకర్‌రెడ్డికి వరంగల్‌కు చెందిన రాఘవ, రామారావుకు అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మోహన్‌లాల్ వీటిని తయారు చేసి ఇచ్చే వారు. ఉస్మానియా వర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ, శ్రీధర్ యూనివర్శిటీ (బెంగళూరు), ఛత్రపతి షానుజీ యూనివర్శిటీ (కాన్పూర్) తదితర విద్యా సంస్థలు, యూనివర్శిటీల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు ఉండేవి. హసన్ ఉత్తరప్రదేశ్‌లోనే సర్టిఫికెట్ల సిద్ధం చేసి తీసుకువచ్చి అమ్మేవాడు.
ఎస్సెస్సీ, ఇంటర్మీడియల్, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో సర్టిఫికెట్లను అవకాశం, అవసరాన్ని బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వేలకు విక్రయించే వారు. ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కమీషన్ ఇచ్చే వారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడిడ తమ బృందాలతో ఆదివారం వలపన్ని మోహన్‌లాల్ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు.
వీరి నుంచి 450 నకిలీ సర్టిఫికెట్లు, 92 బోగస్ రబ్బర్ స్టాంపులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు వీరి నుంచి సర్టిఫికెట్ల ఖరీదు చేసిన వారినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. ఈ నిందితుల్లో కొందరు గతంలోనే ఇదే తరహా కేసుల్లో పోలీసులకు చిక్కారు.