దీర్ఘకాలంలో మంచి ఫలితాలు
కొన్నేళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్
అవినీతి రహిత ఆర్థిక వ్యవస్థ
బ్యాంకుల వద్ద అపారంగా నిధులు
తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు
పెద్ద నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ అంచనా
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు చింతిస్తున్నామని, ఈ ఇబ్బందులను ముందే ఊహించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించగలమని, రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నిధులు అపారంగా ఉంటాయని, అవినీతి రహితమైన ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పెట్రోకెమికల్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
భవిష్యత్తులో భారీ మార్పులు..
భవిష్యత్తులో భారత్ చాలా పెద్ద పెద్ద మార్పులకు గురికానున్నదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వెలిబుచ్చారు. అరుుతే పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వలన దేశంలో కరెన్సీ కొరత ఏర్పడిందని ఆయన అంగీకరించారు. ఆర్‌బీఐ కొంత మొత్తంలో నగదును సర్దుబాటు చేసిందని, దీనికి సమాంతరంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెంచడం ద్వారా ఈ కొరత సమస్యను అధిగమించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీల విషయమై గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన వృద్ధి కన్నా రానున్న 2/3 నెలల్లో మరింత వృద్ధి సాధించగలమని చెప్పారు.
పన్ను ఆదాయం పెరుగుతుంది..
ఈ చర్య కారణంగా బ్యాంకుల వద్ద నిధులు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే శక్తి బ్యాంకులకు మరింతగా పెరుగుతుందని, తక్కువ వడ్డీరేట్లకే బ్యాంక్ రుణాలు లభిస్తాయని జైట్లీ వివరించారు. ఈ చర్య వల్ల బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయని, పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాదీ అదే జోరు...
మన దేశంలో 80 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయని, అయితే వీటిల్లో 45 కోట్ల కార్డులను మాత్రమే చురుగ్గా ఉపయోగిస్తున్నారని, ఈ దృష్ట్యా డిజిటల్ లావాదేవీల జోరును పెంచాల్సి ఉందని జైట్లీ వివరించారు. గత కొన్నేళ్లుగా సరైన సంస్కరణలు లేక మన దేశం నీరసించిందని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించామని, ఈ ఏడు కూడా అదే జోరు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే వర్థమాన దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రియల్ ఎస్టేట్, మరికొన్ని రంగాల్లో 2 విధాలుగా చెల్లింపులు జరపడం (నల్లధనం, తెల్ల ధనం) ప్రజలకు అలవాటు అయిపోయిందని.. దీన్ని ప్రభుత్వం మార్చాలని గట్టిగా ప్రయత్ని స్తోందని జైట్లీ స్పష్టం చేశారు.