సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద.. కిసాన్ క్రెడిట్ కార్డులపై రాష్ట్రంలో పంట రుణాలు, మత్స్య, పశు సంవర్ధక రంగాలకు కలిపి బ్యాంకులు ఇప్పటివరకు రూ.7,362.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో మందగించిన ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, అలాగే రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలను మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై 2.50 కోట్ల మంది రైతులకు పంట రుణాలను మంజూరు చేయించాలని లక్ష్యంగా నిర్ధారించింది. అలాగే దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ కింద 7,66,827 దరఖాస్తులు అందాయి. ఇందులో అర్హత గల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చింది.
ప్యాకేజీ కింద వీలైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగా బ్యాంకులు సైతం సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యాంకులు కూడా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి.
కిసాన్ క్రెడిట్.. రూ.7,362 కోట్లు
Published Sun, Jan 3 2021 4:11 AM | Last Updated on Sun, Jan 3 2021 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment