సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాకు అదనంగా కొన్ని నిబంధనలు చేర్చింది. దేశ వ్యాప్తంగా మొండి బకాయిలు పెరిగిపోయాయనే కారణంతో ఇకపై రుణాలు పొందడాన్ని కఠినతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే డబ్బులిస్తామని, అది కూడా పాత బకాయిలు చెల్లించిన వారికేనని షరతు విధించింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా డిస్కంలు విద్యుత్‌ను పొందడంపైనా ఆంక్షలు విధించనుంది. సకాలంలో చెల్లింపులన్నీ పూర్తి చేసిన సంస్థలు మాత్రం 0.5 శాతం అదనంగా రుణాలు పొందవచ్చంటూ అనుమతినిచ్చింది.
దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..
కేంద్ర విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాలు రూ.71,865 కోట్లకు చేరాయి. ప్రభుత్వ విభాగాల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.52,052 కోట్లు ఉన్నాయి. ఏటా నష్టాల వల్ల పెట్టుబడులు పెట్టిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. 2019–20లో డిస్కంల మొత్తం టర్నోవర్ రూ.7,28,975 కోట్లలో రూ.5,14,232 కోట్లు అప్పులే ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌కో, జెన్‌కోలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అది రూ.93,585 కోట్లుగా ఉంది. డిస్కంలకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన సబ్సిడీ ఆదాయం సగటున 16.5 శాతం ఉంది. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ఇది 30 నుంచి 41 శాతం వరకూ ఉండటం వాటి మనుగడకు ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది.
ముసాయిదాను అనుసరించాలి..
ఈ ముసాయిదా ప్రకారం డిస్కంలకు కేంద్రం కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. విద్యుత్ కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా జెన్‌కోలకు డిస్కంలు నగదు చెల్లించాలి. కనీసం 75 రోజుల్లోనైనా బిల్లు క్లియర్ చేయాలి. లేదంటే తొలుత 25 శాతం విద్యుత్ తగ్గిస్తారు. అప్పటికీ చెల్లించకుంటే వంద శాతం తగ్గించడమే కాకుండా బయట మరెక్కడా కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేస్తారు.
పాత బకాయిలను మాత్రం 6 నుంచి 24 నెలలలోపు వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇవి పూర్తిగా చెల్లిస్తే ఆంక్షలన్నీ ఎత్తివేసి యధావిధిగా విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తారు. జనవరి 10వ తేదీలోగా ఈ ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే సమయంలో ఈ నిబంధనలన్నిటినీ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తూ బ్యాంకర్లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు.
బ్యాంకర్లకు కేంద్రం ప్రధాన సూచనలు..
► డిస్కంల ఆడిట్ లెక్కలన్నీ ఏటా పక్కాగా ఉండాలి.
► విద్యుత్ చార్జీల టారిఫ్ పిటిషన్లు ఏటా నవంబర్ 30లోగా సమర్పించాలి.
► ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి తీసుకురావాలి.
► 2019 ఏప్రిల్ 1వతేదీ నాటికి ఉన్న సబ్సిడీలన్నీ క్లియర్ చేయాలి.
► మొత్తం ఆదాయంలో వర్కింగ్ క్యాపిటల్ 25 శాతానికి మించకూడదు.
► రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఎటువంటి బకాయిలు ఉండకూడదు.
► పాత బకాయిల చెల్లింపులకు 12 నెలవారీ వాయిదాల వరకూ అవకాశం.
► బ్యాంకులు లేదా విద్యుత్ ఆర్థిక సంస్థలకు డిస్కంలు డిఫాల్టర్ కారాదు.
Comments
Please login to add a commentAdd a comment