సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అన్నదాతలకు పుష్కలంగా వ్యవసాయ రుణాలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను బ్యాంకులు విరివిగా మంజూరు చేస్తున్నాయి. ఏడాదికేడాదికి రైతుల సంఖ్యతో పాటు రుణాల మంజూరులో పెరుగుదల ఉంది.
గత మూడేళ్లలో అంటే 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు 307.20 లక్షల మంది రైతులకు రూ.4,37,828 కోట్ల వ్యవసాయ రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాల మంజూరు లక్ష్యం రూ.97,197 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.85,346 కోట్ల రుణాలను 48.49 లక్షల మంది రైతులకు బ్యాంకులు మంజూరు చేశాయి.
మరో పక్క రాష్ట్రంలో కౌలు సాగుదారులకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుదారు హక్కుల చట్టం–2019ను తీసుకువచ్చింది. ఈ చట్టం కింద పంట సాగుదారుల హక్కు పత్రాలు పంపిణీ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు సీసీఆర్‌సీ పత్రాలు జారీ చేయడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి.
కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ఆర్బీకేల్లోని సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు 4.75 లక్షల మంది కౌలు రైతులకు రూ.3595.02 కోట్ల మేర బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వీలైనంత ఎక్కువ మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
బ్యాంకర్ల సమావేశాల్లో ఈ విషయంపై సీఎంతో పాటు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గత సర్కారు.. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని మోసం చేయడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి రుణాలు పొందలేకపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మార్చేసి, రైతులకు మేలు చేసే పలు నిర్ణయాలు తీసుకుంది.
AP: రైతులకు పుష్కలంగా రుణాలు
Published Mon, Sep 26 2022 5:27 AM | Last Updated on Mon, Sep 26 2022 8:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment