తమ్ముడా మజాకా !
► తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత ఆగడాలు
► కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటలపై బ్యాంకులో రుణాలు
► 260 మంది పేరుతో రూ.14 కోట్లు కైంకర్యం
► కర్షకులకు బ్యాంకర్లు, కోర్టు నోటీసులు అల్లాడుతున్న రైతులు
సాక్షి, విజయవాడ : జిల్లాలో టీడీపీ నేతల అడ్డగోలు సంపాదనకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ‘తమ్ముళ్లు’ రైతులను కూడా వదలడం లేదు. ఒకవైపు ప్రభుత్వం పొలాలను గుంజుకుంటుండగా... మరోవైపు టీడీపీ నేతలు అరకొరగా పండిన పంటలను కూడా వదలడం లేదు. ఇందుకు తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి ఆగడాలే నిదర్శనం. సదరు నాయకుడు తన కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటలపై రైతుల పేరు మీద ఒక ప్రభుత్వ బ్యాంక్‌లో రూ.14 కోట్లు రుణం తీసుకున్నాడు.
కొద్దిరోజుల క్రితం ఆ బ్యాంక్ అధికారులు రుణాలు చెల్లించాలని 260 మంది రైతులకు నోటీసులు ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అంతా తాను చూసుకుంటానని సదరు నాయకుడు హామీ ఇచ్చాడు. రైతులు కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. రుణాలు చెల్లించలేదంటూ బ్యాంకు అధికారులు కోర్టులకు వెళ్లడంతో నూజీవీడు, మధిర కోర్టుల నుంచి రైతులకు నోటీసులు వస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోల్డ్ స్టోరేజీ నుంచి బ్యాంకులో రుణాలు తీసుకున్నట్లు ఉండడం.. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో రైతులకు మిగిలిన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతులంతా కలిసి టీడీపీ నేత, ఆయన కుమారుడిని నిలదీయడంతో వారు అడ్డం తిరిగారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
సిండికేట్‌గా ఏర్పాటు...
తాను మాత్రమే తప్పు చేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన ఆ నాయకుడు... మైలవరం నియోజకవర్గం ముచ్చనపల్లికి చెందిన ‘బాయ్’గా పిలవబడే ఒక వ్యక్తిని, మరో టీడీపీ నాయకుడిని కలుపుకొని సిండికేట్‌గా ఏర్పడ్డారు. జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రికి బాయ్ ముఖ్య అనుచురుడు కావడంతో వారికి అడ్డులేకుండా పోయింది. మంత్రి అండతో ఈ సిండికేట్ అక్రమార్జనలో దూసుకుపోతోంది. తమ భూ కబ్జాలను అడ్డుకున్న గంపలగూడెం తహసీల్దార్‌ను ఇటీవల బదిలీ చేయించారు. తమ మాట వినని ఇతర అధికారులపై ఏసీబీ దాడులు చేయించి ఒత్తిడికి గురి చేస్తున్నారు.
కాంట్రాక్టర్లకు బెదిరింపు
రూ.16 కోట్లతో చేపట్టనున్న చీమలపాడు–గంపలగూడెం ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు నాలుగు రోజుల క్రితం ఈ– టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ సిండికేట్ ప్రతినిధులు కూడా టెండర్లు వేశారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక కాంట్రాక్టర్ లెస్ టెండర్ వేశారు. ఆ తర్వాత విజయవాడకు చెందిన మరో కాంట్రాక్టర్ కొద్దిగా ఎక్కువకు టెండర్ వేశారు. సదరు సిండికేట్ కాంట్రాక్టర్ 4శాతం ఎక్కువ రేటుకు టెండర్ వేయడమే కాకుండా మరో మూడు డమ్మీ టెండర్లు వేయించారు.
ఇప్పుడు తమకు టెండర్ రాదని తెలుసుకున్న సదరు సిండికేట్... ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి చేత ఒత్తిడి తీసుకొచ్చి టెండర్లు ఖరారు కాకుండా ఆపినట్లు తెలిసింది. మరోవైపు ఈ సిండికేట్ సభ్యులు రంగంలోకి దిగి విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌తో టెండర్‌ను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడు కాంట్రాక్టర్ కూడా తన టెండర్‌ను ఉపసంహరించుకునేలా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.