పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు, నిందితుడు ప్రణయ్ (ఇన్‌సెట్)
బంజారాహిల్స్: ప్రముఖ బ్యాంకు ఆమోదం ఉందంటూ ఓ డొల్ల కంపెనీని ఏర్పాటుచేసి ... ఈ కంపెనీ బ్యాంకు కన్నుసన్నల్లోనే నడుస్తుందని ప్రచారం చేసి 40 మంది నిరుద్యోగ యువకులకు వెరిఫికేషన్ ఆఫీసర్లు, డాక్యుమెంట్ పికప్, చెక్స్ విత్‌డ్రా విభాగం అంటూ ఉద్యోగాలు కల్పించారు. అనంతరం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి సంతకాలు చేయని ఖాళీ చెక్కులు తీసుకుని వాటిపై ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంకుల్లో లక్షలు డ్రా చేశారు. మోసపోయిన బాధితులు, ఉద్యోగులు మంగళవారం బంజారాహిల్స్ పోలీసును ఆశ్రయంచారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌కు చెందిన మురళి అనే వ్యాపారికి ఈ నెల 18న ఓ బ్యాంకు పేరుతో టెలికాలర్ ఫోన్ వచ్చింది. రుణం కావాలా..? అని అడిగాడు. ఇల్లు కట్టుకునేందుకు రుణం కావాలని మురళి చెప్పారు. ఇందుకుగాను ఆదాయ ధ్రువీకరణ పత్రాలను టెలీకాలర్ అడిగాడు.
రెండు రోజుల తరువాత బ్యాంకు నుంచి వచ్చినట్లు చెప్పిన ప్రశాంత్ అనే యువకుడు మురళి వద్ద నుంచి డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు ఓ యువతి ఫోన్ చేసి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇళ్లు కట్టే స్థలం తనిఖీకి తమ ప్రతినిధులు వస్తారని పేర్కొంది. ఆ రెండు రోజుల తరువాత ఇద్దరు యువకులు బ్యాంకు నుంచి వస్తున్నట్లు చెప్పి స్థలాన్ని చూసి వెళ్లిపోయారు. అదే రోజు బ్యాంకు నుంచి ఫోన్ చేసి రెండు కోట్ల రుణం ఇస్తామన్నారు. కాకపోతే కొన్ని షరతులు పూర్తి చేసేందుకు సంతకాలు పెట్టని చెక్కులు కావాలని కోరారు. మురళి ఐదు చెక్కులను వారికి అందజేశారు. అంతే మరుసటి రోజు మురళి ఖాతాలో ఉన్న రూ.1.65 లక్షలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఖంగుతిన్న మురళి వెంటనే రుణం ఇస్తామని చెప్పిన వారి ఫోన్ కోసం ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రుణం పేరిట ఫోన్ చేస్తుంది ఓ డొల్ల కంపెనీ అని గుర్తించారు. బెంగళూర్‌కు చెందిన మహేశ్ అలియాస్ ఎం.ప్రణయ్ రాయ్ అలియాస్ మధు(45)గా తేలింది. తమను ఇంటర్వ్యూ చేసింది బాలాజీ అలియాస్ సురేష్ మెహతా అని బాధితులు తెలిపారు. సికింద్రాబాద్‌లో బుజ్‌వర్క్, ఫార్చూన్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఓ కార్యాలయం తెరిచి సుమారు 49 మంది యువతీ, యువకులను ఉద్యోగులుగా చేర్చుకున్నారు. టెలీకాలర్ ద్వారా నగరవాసులకు ఫోన్ చేసి రుణం పేరిట ఆకర్షించి మోసం చేస్తున్నట్లు తేలింది. మంగళవారం మురళితో పాటు హిమాయత్‌నగర్‌కు చెందిన దయాకర్ రెడ్డి అనే వైద్యుడు రూ. 5.50 లక్షలు, గౌస్ అనే వ్యక్తి రూ.40వేలు పోగొట్టుకున్నట్లు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఖాతాలో కూడా రూ.6 లక్షలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ సంతకాలు సరిపోకపోవడంతో ఆ ప్రయత్నం సాధ్యం కాలేదు. కేవలం పదిరోజుల్లో రూ.10 లక్షలకు పైగా ఆ డొల్ల కంపెనీ ప్రతినిధులు కొల్లగొట్టారు.
పక్కా ప్రణాళికతో...
♦ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్రణాళికలతో మోసాలకు పాల్పడ్టట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల వద్ద సంతకాలు పెట్టని ఖాళీ చెక్కులు తీసుకుంటూ అనుమానం రాకుండా వారి ముందే చెక్కులుపై ఓ ప్రముఖ బ్యాంకు తాలుకు స్టాంప్ వేయడంతో బాధితులు భరోసాగా ఫిలయ్యారు.
♦ అయితే ఆ తరువాత ఆ చెక్కులను తీసుకున్న డొల్ల కంపెనీ ముఠా వాటిపై ఉన్న స్టాంప్‌లను తుడిచేసి ఫోర్జరీ సంతకాలు చేశారు. అప్పటికే రుణం కోసం వివిధ పత్రాలపై చేయించుకున్న సంతకాల ఆధారంగా సంతకాలు ఫోర్జరీ చేయగలిగారు. ఆ విధంగా డబ్బును తమ ఖాతాలోకి ఆర్టీజీఎస్ పద్ధతిలో మళ్లించుకున్నారు.
పై నుంచి దూకిన నిందితుడు
ఇదిలా ఉండగా ఓ బాధితుడు నిందితుడి కోసం గాలిస్తూ గూగుల్ మ్యాప్ ద్వారా వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న మోసగాడి జాడ కనిపెట్టారు. నేరుగా మంగళవారం ఉదయం మిగతా బాధితులతో కలిసి ఆ లాడ్జి వద్దకు స్థానిక పోలీసుల సాయంతో చేరుకున్నారు.దీంతో గమనించిన నిందితుడు ప్రణయ్ లాడ్జి రెండో అంతస్తునుంచి కిందికి దూకాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం బంజారాహిల్స్ పోలీసులకుఅప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment