వేణుగోపాల్‌రావు
సాక్షి సిటీబ్యూరో: సెట్విన్ సంస్ధ ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో 24 సెంటర్లలో 11 వేల మంది యువతకు, 30 కోర్సుల్లో శిక్షణ ఇచ్చామని, ఇందులో దాదాపు 80 శాతం విద్యార్థులకు ప్లెస్‌మెంట్ కల్పించినట్లు సెట్విన్ మేనేజింగ్ డైరెకర్ట్ వేణుగోపాల్‌రావు తెలిపారు. శుక్రవారం ఈ ఏడాది సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, వచ్చే ఏడాది చేపట్టనున్న కార్యక్రమాలపై మీడియాకు వివరించారు. సెట్విన్ ద్వారా ట్రెయినింగ్, ట్రాన్స్‌పోర్టు, ట్రేడింగ్ మూడు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సంస్థతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖల సౌజన్యంతో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సంస్థ శిక్షణా కేంద్రాలతో పాటు ఈ ఏడాది 15 ప్రైవేట్ సంస్థల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చిందన్నారు. ఈ ఏడాది నగరంతో పాటు గజ్వేల్, డిచ్‌పల్లిలో సెట్విన్ సెంటర్లలను ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, మహబూబ్‌నగర్‌లో సంస్థ తమ సెంటర్లను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మైనార్టీ యువతకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన కేజీఎన్ పథకం ద్వారా ఈ ఏడాది 800 మందికి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు.
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 160 మందికి మొబైల్ టెక్నిషియన్, రిఫ్రెజిరేటర్ రిపెరింగ్‌తో పాటు యువతులకు బ్యూటీషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ట్రాన్స్‌పోర్టులో భాగంగా నగరంలోని వివిధ రూట్‌ల్లో సంస్థ వంద బస్సు సర్వీసులు నడుపుతున్నామని, వచ్చే ఏడాది సెట్విన్ ద్వారా కొత్త బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకుగాను బస్సు నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారు తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏప్రిల్‌లో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తాయన్నారు. ట్రేడింగ్‌లో భాగంగా పలు విద్య సంస్థలకు నోట్‌బుక్‌ల సరఫరా చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి కొత్త నగరంలో విద్యార్థుల కోసం సీతాఫల్ మండీలో మాజీ మంత్రి పద్మారావుగౌడ్ నిధులతో నిర్మించిన బహుల అంతస్తుల సెట్విన్ భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే పాత నగరం విద్యార్థులకు ఖిల్వత్ మోతీగల్లీలోని సెంటర్ ఉందని, ఇక కొత్త నగరంలో కూడా అన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి సెట్విన్ హోమ్ సర్వీస్ యాప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా సెట్విన్ సంస్థలో శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితరులు ఇంటి వద్దకు వచ్చి సేవలు అందజేస్తారన్నారు. వచ్చే ఏడాది 20 వేల మంది యువతకు సెట్విన్ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటీకే భీమాస్ ఆల్పహారం ద్వారా నగరంలో పలు ప్రాంతాల్లో 2018 సంవత్సరంలో టిఫిన్లను అందజేస్తున్నామని, వచ్చే ఏడాది వీటి సంఖ్యను పెంచనున్నట్లు ఆయనపేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment