నల్ల రేగళ్లలో నాగేటి సాళ్లు
భారీ వర్షాలతో దుక్కులు దున్నుతున్న రైతన్నలు
- విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధం
- ఇంకా రుణాలివ్వని బ్యాంకులు
- రైతు సమగ్ర సర్వేలో వ్యవసాయశాఖ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: అన్నదాత నాగలి పట్టాడు.. ఏరువాకకు సిద్ధమయ్యాడు.. రెండు మూడ్రోజుల నుంచి వర్షాలు పడు తుండటంతో ఉత్సాహంగా పొలంబాట పట్టాడు.. ఇటీవల కొన్నిచోట్ల మోస్తరు నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజులు సాధా రణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో అనేకచోట్ల రైతులు దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపో యినా అప్పోసొప్పో చేసి సాగుకు అవసర మైన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే బ్యాంకులు మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర పంటల రుణ ప్రణాళిక ఇంకా విడుదల చేయలేదు. బ్యాంకు రుణాలు అందక రైతులు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. మొత్తం వ్యవసాయ యంత్రాంగం రైతు సమగ్ర సర్వేపైనే దృష్టి సారించి వానాకాలం పంటల సాగును గాలికొదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక కూడా విడుదల చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వలేదు.
1.08 కోట్ల ఎకరాల్లో సాగు..
2017ృ18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. ఇది గతేడాది కంటే 6 లక్షల ఎకరాలు అదనం. 2016ృ17 వానాకాలంలో వరి 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 16.20 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయించారు. 2017ృ18 ఆర్థిక సంవత్సరంలో 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో వరి 58.11 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఖరీఫ్‌లో 32.47 లక్షల టన్నులు పండిస్తారు. లక్ష్యాలన్నీ బాగానే ఉన్నా రైతులకు అవసరమైన బ్యాంకు రుణాలు అందడంలో సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకులు రైతులకు పైసా కూడా రుణం ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి.
పెరిగిన సాగు ఖర్చు
ఎకరా విస్తీర్ణంలో సాధారణ వరి ధాన్యం పండించేందుకు రూ.43,160 ఖర్చవుతోంది. అన్ని వ్యయాలను లెక్క లోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చిన ఖర్చు ఇది. ఇక ఏ గ్రేడ్ వరి రకం సాగుకు ఎకరాకు రూ.44,121 ఖర్చవు తోందని తేల్చింది. అలాగే కందికి రూ. 14,246, మొక్కజొన్నకు రూ.26,507, సోయాబీన్‌కు రూ.19,433, పత్తికి రూ. 44,860 ఖర్చవుతుందని తేల్చింది. అంత మేర పెట్టుబడులు ఉంటేనే రైతు నిలదొ క్కుకోగలడు. కానీ బ్యాంకు రుణాలు ఇప్పటికీ అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతన్న ప్రైవేటు అప్పుల వైపు చూస్తున్నాడు.