Farmer comprehensive Survey
-
45 లక్షల మంది రైతులు.. 1.24 కోట్ల ఎకరాలు
రైతు సమగ్ర సర్వే నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని రైతులు, వ్యవసాయ భూములకు సంబంధించి చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదిక వివరాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. వెయ్యి ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న గ్రామాలు సగానికిపైగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 10,733 గ్రామాలుంటే, వాటిలో వెయ్యి ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న గ్రామాల సంఖ్య 5,976 ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించింది. వెయ్యి ఎకరాల లోపు ఉన్న గ్రామాల్లో 13.91 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 30.43 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 1,001 నుంచి 2 వేల ఎకరాలున్న గ్రామాలు 3,111 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 15.83 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 43.65 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 2,001 నుంచి 3 వేల ఎకరాలున్న గ్రామాలు 1,001 ఉన్నాయి. వాటిలో 7.65 లక్షల మంది రైతులున్నారు. వారి వద్ద 23.85 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 3,001 నుంచి 4 వేల ఎకరాల లోపున్న గ్రామాలు 376 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 3.67 లక్షల మంది రైతులుంటే, వారి వద్ద 12.26 లక్షల ఎకరాల భూమి ఉంది. 4,001 నుంచి 5 వేల ఎకరాల లోపున్న గ్రామాల సంఖ్య 152 ఉండగా, వాటిలో 1.88 లక్షల మంది రైతులున్నారు. వారి వద్ద 6.54 లక్షల ఎకరాల భూమి ఉంది. 5 వేల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములున్న గ్రామాలు 117 ఉన్నాయి. వాటిలో 2.13 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 7.30 లక్షల ఎకరాల భూమి ఉంది. 1,001 నుంచి 2 వేల ఎకరాల లోపున్న గ్రామాల్లోనే అత్యధికంగా 43.65 లక్షల ఎకరాల భూమి ఉండటం గమనార్హం. అక్కడే రైతుల సంఖ్య కూడా అధికంగా ఉందని రైతు సమగ్ర సర్వే తెలిపింది. -
రైతు సమగ్ర సర్వేను అమలు చేయాలి
► జిల్లాలో 6,05,674 ఎకరాల్లో 2.48 లక్షల మంది రైతులుగా గుర్తించాం ► 10వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలి ► వ్యవసాయాధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం: రైతు సమగ్ర సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీసీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో జిల్లాలో చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వే వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు సమగ్ర సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 6,05,674 ఎకరాల్లో 2,00,048 మంది రైతులు సాగు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వారిలో అర్హులైన ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వారి సమాచార వివరాలను నమోదు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో రైతు సమగ్ర సర్వే ప్రక్రియలో సేకరించిన వివరాలతో వ్యత్యాసాలు రాకుండా పక్కాగా రూపొందించాలన్నారు. సర్వే నిర్వహించిన వివరాలను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి సమగ్ర నివేదిక రూపొందించాలని, ప్రతిరోజు రీవెరిఫికేషన్ చేసిన వివరాలను వెంటవెంటనే కంప్యూటరీకరించేందుకు సత్వర చర్యలు చేపట్టాని సూచించారు. భూసేకరణ కింద సేకరించిన ప్రభుత్వ భూముల వివరాలను రైతు సమగ్ర సర్వేలో నమోదుగాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఆర్.శ్రీనివాసరావు, వివిధ స్థాయిల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
లెక్క తేలింది..
► ముగిసిన రైతు సమగ్ర సర్వే ► జిల్లాలో 81.5 శాతం నమోదు ► పూర్తి కాని లక్ష్యం.. ► సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు ► నమోదు చేసుకోనివారికి నష్టమే జిల్లాలో రైతుల సంఖ్య 1,32,268 నమోదు చేసుకున్న రైతులు 1,07,888 నమోదు శాతం 81.57 మండలాలు 18 గ్రామాలు 510 సర్వేలో పాల్గొన్న సిబ్బంది 109 ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే గురువారం ముగిసింది. జిల్లాలో కొంతమంది రైతులు ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతీ అన్నదాతకు ఎకరానికి రూ.4 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి ఈ నెల 15 వరకు రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టారు. ఈ నెల 10 వరకు గడువు ముగిసినప్పటికీ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఐదు రోజులపాటు గడువు పెంచింది. అయినా ఒక శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,32,268 మంది రైతులు ఉండగా, ఇందులో 1,07,888 మంది సర్వేలో నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 24,380 మంది రైతులు సర్వే చేయించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 81.57 శాతం నమోదు కాగా, 18.43 శాతం సర్వే చేసుకోలేదు. కొంతమంది రైతులు ఉపాధి రీత్యా వారి సొంత గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నందున వారి వివరాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. లెక్క పక్కా.. రైతుల సమగ్ర సర్వేతో భూములు సాగు విస్తీర్ణం పక్కాగా తెలుస్తోంది. గతంలో రైతులు ఎక్కడ, ఏ పంటలు, ఎంత మేరకు వేశారనేది రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పూర్తి స్థాయిలో సమాచారం ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో వేసిన పంటలకు అధికారుల లెక్కలకు ఎలాంటి పొంతన ఉండేది కాదు. ప్రభుత్వం ప్రతి ఎకరం సాగుకు రూ.4 వేలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. మండలాల్లో ఏవోతోపాటు ఏఈవో అందుబాటులో ఉండడంతో రైతుల వివరాలు సమగ్రంగా సేకరించారు. సర్వేలో 79 మంది ఏఈవోలు, 18 మంది ఏవోలు, ఆరుగురు హెచ్‌ఈవోలు, ఆరుగురు ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు. 24 అంశాలతో వివరాలు.. ప్రభుత్వ ఆదేశాలతో రైతుల సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. వ్యవసాయ శాఖ రూపొందించిన నమూనా పత్రంలో రైతులకు సంబంధించిన 24 అంశాలు ఉన్నాయి. నమూనా ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో రైతు పేరు, తండ్రి పేరు, సామాజిక వర్గం, ఆధార్ కార్డు, వరుస సంఖ్య, బ్యాంక్ ఖాతా, భూముల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, నీటి సౌకర్యం ద్వారా భూమి, వర్షాధారం కింద సాగయ్యే భూమి సాగు చేసే పంటల రకాల వివరాలు, ఫోన్ నంబరుతో సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఏఈవోలు తమ గ్రామాల పరిధిలో కంప్యూటర్లో నమోదు చేశారు. ప్రస్తుతం సేకరించిన వివరాలతోనే ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించే వీలుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వేలో నమోదు చేసుకోనివారికి ప్రభుత్వం నుంచి రైతులకు అందజేసే సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు వర్తించబోవని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గురువారంతో గడువు ముగిసింది. 10వ తేదీ వరకు 80 శాతం సర్వే పూర్తి కాగా, ఐదు రోజులు గడువు పెంచినప్పటికీ ఒక శాతం కంటే ఎక్కువ రైతులకు సంబంధించిన వివరాలు లభ్య కాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో ఉండే భూ యాజమానులు వివరాలు నమోదు చేసుకోలేదు. గడువు దాటితే తామేమీ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు గతంలో చెప్పినప్పటికీ ఇంకా కొంతమంది సమగ్ర భూ సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేదు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి రూ.4 వేలు సాగు ఖర్చుకు ఇస్తుంది. ఖరీఫ్, రబీ పంటలు రెండింటికీ ఏడాదికి రూ.8 వేలు రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో.. జిల్లాలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు పట్టాలు లేవు. దీంతో సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు. సర్వే ఆధారంగా ప్రభుత్వం అందజేసే రూ.4వేలు అందవని గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఎళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న చాలా మంది గిరిజనుల భూములకు కూడా పట్టాలు లేవు. దీంతో వారి పేర్లు కూడా నమోదు చేసుకోలేదు. జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సమగ్ర సర్వే ముగిసింది జిల్లాలో 94 క్లస్టర్లో 510 రెవెన్యూ గ్రామాల్లో లక్షా 7,888 మంది రైతులు సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నారు. 81.57 శాతం నమోదైంది. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు జారీ చేస్తాం. సర్వే చేయించుకోని రైతులకు ప్రభుత్వం నుంచి అందజేసే రాయితీ, తదితర పథకాలు వర్తించవు. జిల్లాలో అత్య«ధికంగా బోథ్ మండలంలో 89 శాతం సర్వే చేసుకోగా, ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 63 శాతం నమోదు అయ్యింది. – రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి -
నల్ల రేగళ్లలో నాగేటి సాళ్లు
భారీ వర్షాలతో దుక్కులు దున్నుతున్న రైతన్నలు - విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధం - ఇంకా రుణాలివ్వని బ్యాంకులు - రైతు సమగ్ర సర్వేలో వ్యవసాయశాఖ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: అన్నదాత నాగలి పట్టాడు.. ఏరువాకకు సిద్ధమయ్యాడు.. రెండు మూడ్రోజుల నుంచి వర్షాలు పడు తుండటంతో ఉత్సాహంగా పొలంబాట పట్టాడు.. ఇటీవల కొన్నిచోట్ల మోస్తరు నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజులు సాధా రణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో అనేకచోట్ల రైతులు దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపో యినా అప్పోసొప్పో చేసి సాగుకు అవసర మైన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బ్యాంకులు మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర పంటల రుణ ప్రణాళిక ఇంకా విడుదల చేయలేదు. బ్యాంకు రుణాలు అందక రైతులు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. మొత్తం వ్యవసాయ యంత్రాంగం రైతు సమగ్ర సర్వేపైనే దృష్టి సారించి వానాకాలం పంటల సాగును గాలికొదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక కూడా విడుదల చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వలేదు. 1.08 కోట్ల ఎకరాల్లో సాగు.. 2017ృ18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. ఇది గతేడాది కంటే 6 లక్షల ఎకరాలు అదనం. 2016ృ17 వానాకాలంలో వరి 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 16.20 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయించారు. 2017ృ18 ఆర్థిక సంవత్సరంలో 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో వరి 58.11 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఖరీఫ్‌లో 32.47 లక్షల టన్నులు పండిస్తారు. లక్ష్యాలన్నీ బాగానే ఉన్నా రైతులకు అవసరమైన బ్యాంకు రుణాలు అందడంలో సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకులు రైతులకు పైసా కూడా రుణం ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి. పెరిగిన సాగు ఖర్చు ఎకరా విస్తీర్ణంలో సాధారణ వరి ధాన్యం పండించేందుకు రూ.43,160 ఖర్చవుతోంది. అన్ని వ్యయాలను లెక్క లోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చిన ఖర్చు ఇది. ఇక ఏ గ్రేడ్ వరి రకం సాగుకు ఎకరాకు రూ.44,121 ఖర్చవు తోందని తేల్చింది. అలాగే కందికి రూ. 14,246, మొక్కజొన్నకు రూ.26,507, సోయాబీన్‌కు రూ.19,433, పత్తికి రూ. 44,860 ఖర్చవుతుందని తేల్చింది. అంత మేర పెట్టుబడులు ఉంటేనే రైతు నిలదొ క్కుకోగలడు. కానీ బ్యాంకు రుణాలు ఇప్పటికీ అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతన్న ప్రైవేటు అప్పుల వైపు చూస్తున్నాడు. -
జూన్ 10 నాటికి రైతు సర్వే పూర్తి
అధికారులకు మంత్రి పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతు సమగ్ర సర్వేను జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పోచారం.. అక్కడి నుంచి ప్రతి రోజూ టెలి కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ఏఈవోలు నమోదు చేస్తున్న వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతిరోజూ సమీక్షించాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను శనివారం ఆదేశించారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ సమగ్ర రైతు సర్వే కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా 100 లైన్ల సామర్థ్యంతో టెలి కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. -
పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
►పకడ్బందీగా సర్వే నిర్వహించాలి జైనథ్(ఆదిలాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రైతు సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ కమిషనరేట్ రాష్ట్ర పరిశీలకులు వై.సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మాండగాడ గ్రామంలో కొనసాగుతున్న ‘మా భూమి–మా పంట’ సమగ్ర సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈవోలు గ్రామాల వారీగా ప్రతీ ఇంటికి తిరుగుతూ సర్వే నిర్వహించాలని అన్నారు. రైతు వివరాలు, ఫొటో, సంతకంతోపాటు భూమి, భూమి స్వభావం, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు ఖాత వివరాలు సంబంధిత ఫార్మెట్లో నమోదు చేయాలని తెలిపారు. కాగా రైతుల భూముల వివరాలు రెవెన్యూ రికార్డులైన 1(బి) ప్రకారం సర్వే చేపట్టాలని అన్నారు. జూన్ పదిలోగా అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, వ్యవసాయ శాఖ వెబ్ పోర్టల్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. ఆయన వెంట ఏడీఏ పుల్లయ్య, ఏఈవో విశ్వామిత్ర, రైతులు ఉన్నారు. -
రైతు సమగ్ర సర్వేపై పర్యవేక్షణకు సెల్
- ఇక ప్రతీ రోజూ హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ - క్షేత్ర స్థాయిలో అధికారుల సెలవులు రద్దు సాక్షి, హైదరాబాద్: రైతు సమగ్ర సర్వేపై పర్యవేక్షణకు వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ బుధవారం సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెల్‌కు ఇన్చార్జిగా ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌ను నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ‘రైతుకు ఎకరానికి సీజన్‌కు రూ. 4 వేల పెట్టుబడి’పథకం కోసం రైతుల సమగ్ర వివరాలను సేకరిస్తున్న సంగతి తెలి సిందే. ఆయా వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), మండల వ్యవసాయాధికారులు (ఏవో) ఉన్నారు. ఆ కార్యక్రమ పనితీరు పరిశీలించేందుకు జిల్లాకో రాష్ట్రస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తోన్న కిందిస్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి రైతు సమగ్ర సర్వే చేయని ముగ్గురు ఏఈవోలను ఇప్పటికే సస్పెండ్ చేయగా, సీరియస్‌గా పనిచేయని మరో ఏడుగురు ఏఈవోలకు తాజాగా నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే నెల 10వ తేదీ వరకు కింది నుంచి పై స్థాయి అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యమంత్రి నిత్యం సమగ్ర రైతు సర్వేపై సమాచారం తెప్పించుకుంటున్నారు. సర్వే జరుగుతోన్న తీరును అడిగి తెలుసుకుంటు న్నారు. స్వయానా ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్లకు ఫోన్ చేసి అడుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు 20 శాతం వరకు సర్వే పూర్తయినట్లు కమిషనర్ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. రోజూ సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ఇకనుంచి ప్రతీ రోజూ సాయంత్రం 7 గంట లకు హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అవసరాన్ని బట్టి మంత్రి పోచారం, కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ పాల్గొంటారు. పదో తేదీ వరకు నిత్యం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి స్తారు. మరోవైపు ఏఈవో, ఏవోలకు మొదటి విడత ట్యాబ్‌లను ఒకట్రెండు రోజుల్లో అందజేయనున్నారు.