45 లక్షల మంది రైతులు.. 1.24 కోట్ల ఎకరాలు
రైతు సమగ్ర సర్వే నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని రైతులు, వ్యవసాయ భూములకు సంబంధించి చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదిక వివరాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. వెయ్యి ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న గ్రామాలు సగానికిపైగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 10,733 గ్రామాలుంటే, వాటిలో వెయ్యి ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న గ్రామాల సంఖ్య 5,976 ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించింది. వెయ్యి ఎకరాల లోపు ఉన్న గ్రామాల్లో 13.91 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 30.43 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 1,001 నుంచి 2 వేల ఎకరాలున్న గ్రామాలు 3,111 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 15.83 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 43.65 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 2,001 నుంచి 3 వేల ఎకరాలున్న గ్రామాలు 1,001 ఉన్నాయి.
వాటిలో 7.65 లక్షల మంది రైతులున్నారు. వారి వద్ద 23.85 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 3,001 నుంచి 4 వేల ఎకరాల లోపున్న గ్రామాలు 376 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 3.67 లక్షల మంది రైతులుంటే, వారి వద్ద 12.26 లక్షల ఎకరాల భూమి ఉంది. 4,001 నుంచి 5 వేల ఎకరాల లోపున్న గ్రామాల సంఖ్య 152 ఉండగా, వాటిలో 1.88 లక్షల మంది రైతులున్నారు. వారి వద్ద 6.54 లక్షల ఎకరాల భూమి ఉంది. 5 వేల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములున్న గ్రామాలు 117 ఉన్నాయి. వాటిలో 2.13 లక్షల మంది రైతులుండగా.. వారి వద్ద 7.30 లక్షల ఎకరాల భూమి ఉంది. 1,001 నుంచి 2 వేల ఎకరాల లోపున్న గ్రామాల్లోనే అత్యధికంగా 43.65 లక్షల ఎకరాల భూమి ఉండటం గమనార్హం. అక్కడే రైతుల సంఖ్య కూడా అధికంగా ఉందని రైతు సమగ్ర సర్వే తెలిపింది.