
ఆనందమానందమాయే..
రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇన్నాళ్లూ రుణమాఫీపై వారిలో నెలకొన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీతో పటాపంచలైంది. ఎన్నికల హామీలో భాగంగా
నల్లగొండ : రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇన్నాళ్లూ రుణమాఫీపై వారిలో నెలకొన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీతో పటాపంచలైంది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. వరుస కరువుతో బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రైతు రుణ మాఫీ వల్ల జిల్లాలో 4.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులకు సంబంధించి రూ.1895 కోట్ల మేరకు బ్యాంకు రుణాలు మాఫీ కానున్నాయి. 2013-14 సంవత్సరం వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 6.60,776 మంది రైతులు ఉండగా వారిలో 3,82,887 మంది వ్యవసాయ రుణాలు తీసుకోగా 80,127 మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు. అదేవిధంగా లక్ష రూపాయలకు పైగా వ్యవసాయ రుణాలు పొందిన రైతులు 18,000 మంది ఉన్నారు. కాగా వారు తీసుకున్న రుణాలలో కూడా లక్ష రూపాయల వరకు మాఫీ వర్తింపజేస్తే 460 కోట్ల రూపాయలు మాఫీ కానున్నాయి.
నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లా రైతాంగానికి శుభవార్త. మూడేళ్లుగా పంటనష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ రూ.75.58కోట్ల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 90రోజుల్లోగా సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని 76వేల 466 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
మూడేళ్లుగా నిరీక్షణ..
జిల్లాలో ఏప్రిల్ 2011 నుంచి మే 2014 వరకు వడగండ్ల వాన, కరువుతో పాటు అతివృష్టి కారణంగా పత్తి, వరి, కంది పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలను తయారుచేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి గాను రూ.74.46 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 2011లో వచ్చిన వడగండ్ల వర్షం కారణంగా జిల్లాలో మొత్తం 13మండలాలో 2941 మంది రైతులు రూ.83.11లక్షలు నష్టపోయారు. అదే విధంగా మే 2011లో కురిసిన వడగండ్ల కారణంగా ఒక్క మండలంలో 154 మంది రైతులకు రూ.4.53లక్షల నష్టం జరిగింది.
అదే సంవత్సరం జూలైలో కురిసిన భారీ వర్షాలకు మూడు మండలాల్లో 1259 మంది రైతులు రూ.23.13 లక్షల విలువైన పంటలను నష్టపోయారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు రెండు మండలాలకు చెందిన 500 మంది రైతులు రూ.7.96 లక్షలు నష్టపోయారు. అదే విధంగా మార్చి, ఏప్రిల్ 2012లో వచ్చిన వడగండ్ల వలన 13మండలాలలో 4526 మంది రైతులకు చెందిన రూ.108 లక్షల విలువైన పంట నేలరాలింది. 2013 ఏప్రిల్‌లో వచ్చిన వడగండ్ల కారణంగా 14 మండలాలకు చెందిన 2754 మంది రైతులకు రూ.116 లక్షల మేరకు నష్టం వచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 55 మండలాల్లో 1,35,603 మంది రైతులు రూ.54కోట్ల7లక్షల వరకు నష్టపోయారు.
దీంతో పాటు ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా నారాయణపురం మండలంలో 9555 మంది రైతులకు రూ.8కోట్ల 76 లక్షల నష్టం వాటిల్లింది. 2014 ఏప్రిల్‌లో కురిసిన వడగండ్లతో 14 మండలాలకు చెందిన 18250 మంది రైతులకు రూ.7కోట్ల 96లక్షల విలువైన పంటలకు నష్టం వాటిల్లింది. మే నెలలో వచ్చిన వడగండ్ల కారణంగా 8 మండలాల్లో 924 మంది రైతులు రూ.25.21 లక్షల మేరకు నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ప్రభుత్వానికి అందజేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయకుండా కాలయాపన చేసింది. కాగా నిధులు విడుదల కాగానే ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేయడానికి జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది.